గత మూడు మ్యాచ్‌ల్లో విజయానికి చేరువగా వచ్చి చతికిలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. నేడు పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌తోనైనా బోణీ కొట్టి వరుస ఓటములకు చెక్ పెట్టాలని చూస్తోంది. కాగా, ఈ మ్యాచ్‌లో నెగ్గి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని చూస్తోంది పంజాబ్. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నె చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది.
ఈసారైనా గెలిచేనా?
బ్యాటింగ్‌లో కెప్టెన్ వార్నర్, బెయిర్ స్టో నిలకడగా రాణిస్తున్నారు. మనీష్ పాండే తొలి మ్యాచ్ కోల్‌కతాపై అదరగొట్టినా ఆ తర్వాత విఫలమైపోయాడు. ఇక ఓపెనర్ వృద్ధిమాన్ సాహా నిరాశపరుస్తున్నాడు. మరో బ్యాట్స్‌మన్ విలియమ్సన్ మిడిలార్డర్లో లేకపోవడం వల్ల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక బౌలింగ్‌లో రషీద్ ఖాన్, హోల్డర్, నబీ రాణిస్తున్నప్పటికీ.. మిగతా వారు ఆకట్టుకోవాల్సి ఉంది. మొత్తంగా ఇప్పటికీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది వార్నర్ సేన. మరి ఈసారైనా గెలుస్తుందో లేదో చూడాలి.
కింగ్స్ గాడిన పడేనా?
పంజాబ్ కింగ్స్.. బ్యాటింగ్‌లో అలరిస్తున్నప్పటికీ, బౌలింగ్‌లో మాత్రం విఫలమవుతోంది. అర్ష్‌దీప్ సింద్ పర్వాలేదనిపిస్తున్నప్పటికీ మిగతా వారు పేలవ ప్రదర్శన చేస్తున్నారు. ఆడిన తొలి మ్యాచ్ విజయం సాధించినా.. తర్వాత రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. కాబట్టి సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలవాలంటే జట్టు సమిష్టి కృషి చేయాల్సిందే.