అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా దిల్లీ-బెంగళూరు మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. బలాబలాలలో ఇరు జట్లు దాదాపు సమానంగానే కనిపిస్తున్నాయి. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగేసి విజయాలతో ఉన్న రెండు జట్లకూ.. ఈ మ్యాచ్ ముఖ్యమైనది. రెండింటికీ 8 పాయింట్ల చొప్పున ఉన్నప్పటికీ.. రన్‌రేట్ మెరుగ్గా ఉన్న కారణంగా ఆర్సీబీ కంటే దిల్లీ ముందంజలో ఉంది. ఇవ్వాళ గెలిచిన జట్టు.. చెన్నైను దాటి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటుంది.
ఆర్సీబీ పుంజుకుంటుందా?
చివరగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 69 పరుగుల తేడాతో ఓడిన కోహ్లీ సేన.. సీజన్లో తొలి పరాజయాన్ని చవిచూసింది. 191 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ పూర్తిగా తడబాటుకు గురైంది. ప్రధాన బ్యాట్స్‌మెన్ కోహ్లీ, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ ధాటిగా ఆడినప్పటికీ.. ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. వీరంతా గత మ్యాచ్‌ల్లో చూపిన పట్టుదలను ప్రదర్శిస్తే బెంగళూరుకు ఎదురుండదు.
బౌలింగ్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది ఆర్సీబీ. టీమ్ఇండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్‌తో పాటు హర్షల్ పటేల్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో సఫలమవుతున్నాడు. విదేశీ పేసర్ జేమిసన్ ఈ జట్టుకు అదనపు బలం. అయితే గత మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌లో గొప్పగా రాణించిన కోహ్లీ సేన.. చివరి ఓవర్లో ఏకంగా 37 పరుగులు సమర్పించుకుంది.