తెలంగాణ

telangana

ETV Bharat / sports

వార్నర్ వచ్చాడు.. ఫ్యాన్స్​లో జోష్ తెచ్చాడు

గత కొన్ని మ్యాచుల్లో (IPL 2021) సన్​రైజర్స్​ హైదరాబాద్​ తుది జట్టులో డాషింగ్ బ్యాట్స్​మన్ డేవిడ్ వార్నర్​కు (David Warner) చోటు లభించడం లేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. జట్టు తనను తప్పించినా.. ఆరెంజ్ ఆర్మీ జెర్సీలోనే కనిపించి సన్​రైజర్స్​పై అభిమానాన్ని చాటుకున్నాడు వార్నర్.

David Warner
ఐపీఎల్ 2021

By

Published : Oct 4, 2021, 3:36 PM IST

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner) మళ్లీ జట్టుతో కలిసి స్టేడియానికి వచ్చాడు. ఆదివారం రాత్రి కోల్‌కతాతో తలపడిన సందర్భంగా స్టాండ్స్‌లో కూర్చొని హైదరాబాద్‌ టీమ్‌కు మద్దతు తెలిపాడు. సన్‌రైజర్స్‌ జెండా పట్టుకొని ఆరెంజ్‌ ఆర్మీకి చీర్స్‌ కొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.

సెప్టెంబర్‌ 25న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ టీమ్‌ అతడిని పక్కన పెట్టింది. 27న రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తుది జట్టులో (SRH Squad 2021 Phase 2) అవకాశం ఇవ్వలేదు. దీంతో వార్నర్‌ (David Warner) హోటల్‌ గదికే పరిమితమయ్యాడు. కనీసం టీవీలో జట్టు సభ్యులతోనూ కనిపించకపోవడం వల్ల అభిమానులు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ జట్టుతో కలిసి రావడమే కాకుండా ఆరెంజ్‌ ఆర్మీ జెర్సీలో జెండా ఊపుతూ మద్దతు తెలిపాడు వార్నర్.

సన్​రైజర్స్​కు మద్దుతు తెలుపుతున్న వార్నర్

వార్నర్‌ 2014 నుంచి ఈ జట్టుకు ప్రాతినిధ్యం (Sunrisers Hyderabad Captain) వహిస్తున్నాడు. 2016లో ఛాంపియన్‌గానూ నిలబెట్టాడు. ఏటా టాప్‌ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా రాణిస్తూ సన్‌రైజర్స్‌ను ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. అంత గొప్ప సారథిగా రాణిస్తున్న వార్నర్‌ ఈ ఏడాది (IPL 2021) ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడ్డాడు. అదే సమయంలో జట్టు యాజమాన్యం తొలి దశలో అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించింది. ఇప్పుడు యూఏఈలో ఏకంగా తుది జట్టులోనుంచే తొలగించడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలోనే వార్నర్‌ (David Warner) ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఒక కామెంట్‌ చేసి హైదరాబాద్‌ అభిమానులకు షాకిచ్చాడు. ఈ ఫ్రాంఛైజీ తరఫున ఇదే తన చివరి సీజన్‌ కావొచ్చని తెలిపాడు. కానీ, అందరూ జట్టుకు మద్దతు తెలపాలని కోరాడు.

మరోవైపు వార్నర్‌ను తుది జట్టులో నుంచి తొలగించినా రెండో దశలో (IPL 2021) సన్‌రైజర్స్‌ అదృష్టం ఏమీ మారలేదు. ఇప్పటివరకు మొత్తం 12 మ్యాచ్‌లు ఆడగా పది ఓటములతో అత్యంత ఘోర ప్రదర్శనతో కొనసాగుతోంది. గత మ్యాచ్‌లోనూ కోల్‌కతా చేతిలో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. ఆ రెండింటిలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇదీ చూడండి:'ఉమ్రన్​ను ముందే ఎందుకు తీసుకోలేదు?'

ABOUT THE AUTHOR

...view details