తెలంగాణ

telangana

ETV Bharat / sports

బయోబబుల్​నూ వదలని కరోనా.. ఐపీఎల్​ రద్దేనా! - మాల్దీవులు పారిపోయిన కామెంటేటర్

ఈ ఏడాది ఐపీఎల్​ను కరోనా భయం వెంటాడుతోంది. లీగ్ సజావుగా సాగుతుందన్న సమయంలో బయోబబుల్​లో ఉన్న ఆటగాళ్లకు పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. కేకేఆర్-ఆర్సీబీ మధ్య నేడు జరగాల్సిన మ్యాచ్ రద్దవడం అభిమానుల్ని నిరాశకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో లీగ్​ను రద్దు చేయాలంటూ సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ ఊపందుకున్నాయి.

IPL
ఐపీఎల్​

By

Published : May 3, 2021, 7:13 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్​ లీగ్​గా గుర్తింపు పొందిన ఐపీఎల్​నూ వదిలేలా లేదు. బయోబబుల్ లాంటి సురక్షిత వాతావారణం సృష్టించిన తర్వాత కూడా ఆటగాళ్లు కరోనా బారిన పడటం నిర్వాహకుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. టోర్నీ ప్రారంభంలోనే పలువురు ఆటగాళ్లకు వైరస్ సోకినా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిచిన లీగ్​ను మరోసారి మహమ్మారి ఆలోచనలో పడేసింది. భారత్​లో కేసులు పెరగడం, మైదాన సిబ్బందికి కరోనా సోకడం, ఆటగాళ్లకు పాజిటివ్ రావడం వల్ల అసలు ఈ క్యాష్ రిచ్​ లీగ్​ సజావుగా సాగుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లీగ్​ను రద్దు చేయాలంటే సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ ఊపందుకున్నాయి.

కేకేఆర్, చెన్నై సిబ్బందికి కరోనా

ఇప్పటివరకు సగం టోర్నీ పూర్తయింది. మ్యాచ్​లు రసవత్తరంగా సాగుతున్నాయి. అభిమానులు వారి వారి జట్లు ప్లేఆఫ్స్​కు అర్హత సాధించే అవకాశాలపై లెక్కలు వేసుకుంటున్నారు. అంతా సజావుగానే సాగుతుంది అనే సమయంలోనే మరోసారి కరోనా తెరపైకి వచ్చింది. కోల్​కతా నైట్​రైడర్స్​కు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్​ వారియర్​కు పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో నేడు (సోమవారం) కేకేఆర్-ఆర్సీబీ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. వీరితో పాటు చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ విశ్వనాథన్, బౌలింగ్ కోచ్​ బాలాజీ, బస్ క్లీనర్​కు వైరస్ సోకింది. దీంతో మరోసారి లీగ్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దిల్లీ మైదానం సిబ్బందికీ కరోనా!

దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆదివారం రాజస్థాన్-హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్​కు బాధ్యతలు నిర్వర్తించిన ఐదుగురు సిబ్బందికి కరోనా సోకడం మరింత ఆందళోన కలిగిస్తోంది. వీరు ఆటగాళ్లను కలిసే వీలు ఉండొచ్చని ఓ అధికారి తెలిపారు, దీంతో లీగ్​లో మరికొన్ని మ్యాచ్​లు వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

మాల్దీవులకు జంప్ అయిన కామెంటేటర్!

భారత్​లో కరోనా కేసులు పెరగడం, విదేశాల్లో రవాణాపై ఆంక్షలు పెడుతుండటం వల్ల ఐపీఎల్​ను వీడేందుకు సిద్ధమవుతున్నారు ఆటగాళ్లు. ఇప్పటికే ఆస్ట్రేలియాకు చెందిన పలువురు క్రికెటర్లు లీగ్​ మధ్యలోనే వారి దేశం వెళ్లిపోయారు. మరికొందరు అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆసీస్​కు చెందిన కామెంటేటర్​ మైఖేల్ స్లేటర్​ బయో బబుల్ నిబంధనల్ని అతిక్రమించినట్లు తెలుస్తోంది. వారి దేశంలో రవాణా ఆంక్షలు విధించడం వల్ల ఇతడు మాల్దీవులకు వెళ్లిపోయాడని సమాచారం. మరికొందరు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకోనున్నారని తెలుస్తోంది.

యూఏఈనే బెటర్!

కరోనా కారణంగా గతేడాది లీగ్​ను యూఏఈలో నిర్వహించారు. అక్కడ కూడా కేసులు పెరిగినా లీగ్​ మాత్రం సజావుగా సాగింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగి అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది. ఈ ఏడాది కూడా కరోనా విజృంభిస్తున్నా 14వ సీజన్​ను భారత్​లోనే నిర్వహించేందుకు మొగ్గుచూపింది బీసీసీఐ. కానీ ఇది అనుకున్నంత ఫలితం ఇవ్వట్లేదని తెలుస్తోంది. దేశంలో రోజుకు లక్షల్లో కేసులు రావడం, బయోబబుల్​లో ఉన్న ఆటగాళ్లకు వైరస్​ సోకడం వల్ల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా లీగ్ మాత్రం షెడ్యూల్ ప్రకారం జరుగుతందని చెబుతున్నారు. అయినా బయోబబుల్​లోనూ కరోనా రావడం వల్ల గతేడాది లీగ్​ను యూఏఈ ఉత్తమంగా నిర్వహించిందని అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details