తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ దేశంలో ఐపీఎల్​పై నిషేధం.. కారణం తెలిస్తే షాకవుతారు! - ఐపీఎల్​పై నిషేధం

ప్రపంచమంతా ప్రస్తుతం ఐపీఎల్​ను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఓ దేశ ప్రజలు మాత్రం ఆ వినోదాన్ని పొందలేకపోతున్నారు. దీనికి కారణం ఆ దేశంలో ఐపీఎల్ మ్యాచ్​ల​ ప్రసారంపై నిషేధం విధించడమే. ఇందుకు గల కారణం తెలిస్తే మాత్రం షాకవుతారు.

IPl 2021
ఐపీఎల్​

By

Published : Sep 20, 2021, 4:04 PM IST

Updated : Sep 20, 2021, 5:14 PM IST

ఐపీఎల్ 2021 రెండో దశ యూఏఈలో ప్రారంభమైంది. ఆదివారం ముంబయి ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన పోరుతో లీగ్ మొదలైంది. చాలారోజుల తర్వాత అభిమాన ఆటగాళ్లు బరిలో దిగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్​.. మ్యాచ్​లు చూడటంలో నిమగ్నమయ్యారు. కానీ తాలిబన్ల చేతిలో ఉన్న అఫ్గానిస్థాన్ మాత్రం ఈ వినోదానికి నోచుకోలేదట. దానికి కారణం ఆ దేశంలో ఐపీఎల్ ప్రసారాల్ని నిషేధించడమే అని తెలుస్తోంది.

ప్రస్తుతం తాలిబన్ల చేతిలో చిక్కుకుంది అఫ్గాన్. వారి పాలనలో మతభావాలకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ గల వినోద కార్యక్రమాల ప్రసారాలను ఆ దేశంలో నిషేధించారు. అలాగే ఐపీఎల్​ మ్యాచ్​ల ప్రసారమూ నిలిపేశారు. దీనికి కారణం ఐపీఎల్ మ్యాచ్​లు ప్రసారమయ్యే సమయంలో మైదానంలో చీర్ లీడర్స్​ డ్యాన్స్​లు చేయడం వంటి మతభావ వ్యతిరేక కంటెంట్ ఉండటమేనని తెలుస్తోంది.

"ఐపీఎల్‌ మ్యాచ్‌లను అఫ్గానిస్థాన్‌లో ప్రసారం చేయడం లేదు. ఇందులో కంటెంట్‌, మహిళల డ్యాన్స్‌లు.. తదితర కారణాల దృష్ట్యా ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ ఆఫ్ తాలిబన్‌ ఈ టోర్నీ ప్రసారాలపై నిషేధం విధించింది’" అని అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు మాజీ మీడియా మేనేజర్‌, జర్నలిస్టు ఇబ్రహీం మహ్మద్‌ ట్విట్టర్​లో వెల్లడించారు.

అమ్మాయిలు క్రీడల్లో పాల్గొనకూడదనేది తాలిబన్ల నిబంధన. అందుకోసమే అఫ్గాన్ మహిళలు క్రీడల్లో పాల్గొనడంపై ఎప్పుడో నిషేధం విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా వారు మాత్రం నిబంధనలకు కట్టుబడతామని వెల్లడించారు. దీంతో ఆస్ట్రేలియా పురుషుల జట్టు అఫ్గాన్​తో ఆడాల్సిన టెస్టు మ్యాచ్​ను రద్దు చేసుకుంది. మహిళల్ని ఆడనిస్తేనే తాము ఈ సిరీస్​ ఆడతామని స్పష్టం చేసింది. దీనిపై అఫ్గాన్​ క్రికెట్ బోర్డు, ఆసీసీ బోర్డుకు మధ్య ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి.

అఫ్గానిస్థాన్‌ స్టార్‌ ఆటగాళ్లు రషీద్‌ఖాన్‌, నబీతో పాటు పలువురు అఫ్గాన్‌ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడుతున్నారు. తాలిబన్ల తాజా నిర్ణయం పట్ల వీరు విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇవీ చూడండి: ఈమె.. ఆ ఘనత సాధించిన పాక్ తొలి మహిళా క్రికెటర్

Last Updated : Sep 20, 2021, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details