తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్-14​ వేదికలపై ముదురుతోన్న వివాదం! - punjab kings owner ness wadia

ఐపీఎల్​లో మొత్తం 8 ఫ్రాంఛైజీలున్నా.. ఈ సారి టోర్నీ నిర్వహణకు ఆరు వేదికలకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. ఏ జట్టూలేని అహ్మదాబాద్‌ మైదానంలో మ్యాచ్‌లకు బీసీసీఐ అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో కరోనాను సాకుగా చూపి తమకు సొంత మైదానాల్లో అవకాశం ఇవ్వకపోవడం పట్ల.. పంజాబ్‌, హైదరాబాద్​, రాజస్థాన్ జట్లు గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రాల్లో ఐపీఎల్​ నిర్వహించాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్​.. పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ బీసీసీఐకి సూచించారు. మొహలీలో ఎందుకు నిర్వహించకూడదంటూ పంజాబ్​ కింగ్స్​ సహ యజమాని నెస్​ వాడియా కూడా బీసీసీఐకి లేఖ రాశారు.

IPL 2021: big controversy around IPL 14th season venues
ఐపీఎల్​ నిర్వహణ వేదికలపై ముదురుతోన్న వివాదం!

By

Published : Mar 2, 2021, 5:15 PM IST

ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన క్రికెట్​ టోర్నీల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్​) ఒకటి. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి ఈ టోర్నీ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకూ 13 ఎడిషన్లు పూర్తి చేసుకున్న ఐపీఎల్‌.. 14వ సీజన్​కు సన్నద్ధమవుతోంది. ఈ పదమూడు ఎడిషన్లలో.. 2009లో ఎన్నికల కారణంగా ఓ సారి.. ఆ తర్వాత కరోనా కారణంగా గతేడాది ఐపీఎల్ సంరంభానికి ఇతర దేశాలు వేదికలయ్యాయి.

2009లో ఐపీఎల్​ను దక్షిణాఫ్రికాలో నిర్వహించిన బీసీసీఐ.. కరోనా మహమ్మారి నుంచి లీగ్‌ను కాపాడేందుకు 2020లో యూఏఈలో నిర్వహించింది. ఐపీఎల్‌- 2021ను మాత్రం దేశంలో నిర్వహించేందుకు సమాయత్తమైన బీసీసీఐ అందుకు వేదికలను ఎంచుకున్న పద్ధతి వివాదాస్పదంగా మారింది.

నిర్ణయం మార్చుకోవాలంటూ..

కరోనా కారణంగా 8 ఫ్రాంఛైజీలకు తమ సొంత మైదానాల్లో ఆడే అవకాశం కల్పించలేమన్న బీసీసీఐ.. ఆరు వేదికలను మాత్రమే ప్రకటించింది. అందులో అహ్మదాబాద్‌ పేరు కూడా ఉంది. గుజరాత్‌కు సొంత జట్టే లేదు. ముంబయి పేరునూ బీసీసీఐ ప్రతిపాదించింది. మహారాష్ట్రలో కేసులు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ఆ వేదికపై ఇంకా నిర్ణయం పూర్తి కాలేదు.

ఇప్పటివరకు చెన్నై, బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా మైదానాలకు బీసీసీఐ పచ్చజెండా ఊపగా.. ఆయా జట్లకు సొంత మైదానాల్లో ఆడనుండడం కలిసి రానుంది.

ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్​, రాజస్థాన్ రాయల్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీలు బీసీసీఐ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాయి. సొంత మైదానంలో ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్లే ప్లేఆఫ్‌కు వెళ్తుండగా, బీసీసీఐ నిర్ణయం తమ జట్లకు శరాఘాతం అవుతుందని పేర్కొన్నాయి.

కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని.. గతేడాది యూఏఈలో టోర్నీ నిర్వహించిన విషయాన్ని బీసీసీఐ గుర్తు చేస్తోంది. యూఏఈ తటస్థ వేదిక కాబట్టి అన్ని జట్లకూ మైదానాలు సమానమేనని ఇక్కడ మాత్రం పరిస్థితి వేరని ఫ్రాంఛైజీలు బీసీసీఐని తప్పుబడుతున్నాయి. వ్యాపారపరంగానూ నష్టం వస్తుందని చెబుతున్నాయి. బీసీసీఐ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని టీమ్ యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

రాజకీయంగానూ కదలికలు..

ఏ జట్టూ లేని అహ్మదాబాద్‌కు అవకాశం కల్పించి హైదరాబాద్‌, రాజస్థాన్‌, పంజాబ్‌లో మ్యాచ్‌లకు అవకాశం ఇవ్వకపోవడంపై రాజకీయంగానూ స్పందనలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో మ్యాచ్‌ల నిర్వహణకు తెలంగాణ సర్కార్‌ నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు బీసీసీఐకి ట్వీట్‌ చేసిన కేటీఆర్‌.. తమ నిర్ణయం మార్చుకోవాలని కోరారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ కూడా కేటీఆర్​కు మద్దతు పలికారు. హైదరాబాద్‌లో ఐపీఎల్ నిర్వహించాలని సూచించారు.

తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​

మొహలీపై..

పంజాబ్‌లోని మొహలీ ఐపీఎల్ 2021 ఎడిషన్‌ వేదికల్లో లేకపోవడం చూసి తాను ఆశ్చర్యానికి గురయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. ఐపీఎల్ నిర్వహణకు తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని.. మొహలీలో మ్యాచ్‌లు నిర్వహించాలని అమరీందర్ కోరారు.

పంజాబ్​ ముఖ్యమంత్రి కెప్టెన్​ అమరీందర్​ సింగ్​

మరోవైపు ఇదే విషయంపై పంజాబ్​ కింగ్స్​ సహ యజమాని నెస్​ వాడియా బీసీసీఐకి లేఖ రాశారు. మొహలీలో కరోనా కేసులు తక్కువ ఉన్నప్పటికీ ప్రస్తుత సీజన్​ను నిర్వహించేందుకు ఈ వేదికను ఎందుకు ఎంపిక చేయలేదని అడిగారు. మొహలీలో మ్యాచ్​లు నిర్వహించకపోవడంపై తమతో పాటు ఫ్రాంఛైజీ అభిమానులు ఎంతో నిరాశ చెందారని నెస్​ వాడియా అన్నారు. అయితే మొహలీని కూడా ఐపీఎల్​ నిర్వహించే వేదికల్లో చేర్చాలని ఆశిస్తున్నట్లు లేఖలో ప్రస్తావించారు.

ఇదీ చూడండి:వేదికలపై ఫ్రాంచైజీల నిరసన గళం

ABOUT THE AUTHOR

...view details