కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఓటమిపాలవ్వడంపై దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ విచారం వ్యక్తం చేశాడు. ఇప్పుడేం మాట్లాడాలో అర్థం కావట్లేదని బాధపడ్డాడు. బుధవారం(అక్టోబర్ 13) రాత్రి చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన కీలక మ్యాచ్‌లో కోల్‌కతా అనూహ్య విజయం సాధించింది. దీంతో ఈసారైనా కప్పు గెలవాలని ఆశించిన దిల్లీకి మరోసారి ఎదురుగాలి వీచింది. మ్యాచ్ అనంతరం పంత్ మాట్లాడుతూ వచ్చే ఏడాది మరింత మంచి ప్రదర్శన చెస్తామని చెప్పాడు.
"ఇప్పుడెంత బాధ ఉందనేది చెప్పలేను. మాటలు రావడం లేదు. ఎలాగైనా గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. చివరివరకూ పోరాడాలనుకున్నాం. అందుకు తగ్గట్టే ఆఖర్లో మా బౌలర్లు పట్టుదలగా రాణించారు. దాదాపు మ్యాచ్‌ను గెలిపించినంత పనిచేశారు. కానీ, దురదృష్టంకొద్దీ గెలుపొందలేకపోయాం. మరోవైపు మేం బ్యాటింగ్ చేసేటప్పుడు కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో బాగా కట్టడిచేశారు. దాంతో మేం స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయాం. అవసరమైన పరుగులు సాధించలేకపోయాం. అదే మాకు పెద్ద లోటుగా మారింది. అయితే, ఈ సీజన్‌లో మేం చాలా బాగా ఆడాం. ఆటలో ఎత్తుపల్లాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ సహజమే. అయినా, మేం సానుకూల దృక్పథంతో ఉంటాం. అలాగే ముందుకు సాగుతాం" అని పంత్ వివరించాడు.