IPL 2022: భారత టీ20 లీగ్ 15వ సీజన్‌లో పంజాబ్ జట్టు సారథి మయాంక్ అగర్వాల్ తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు కనిపించాడని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల జరిగిన మెగా టోర్నీలో ఆ జట్టు 7 విజయాలు, 7 ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు చేరకుండానే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలోనే తొలిసారి కెప్టెన్సీ చేపట్టిన మయాంక్ బ్యాట్స్‌మన్‌గానూ విఫలమయ్యాడు. అతడు 13 మ్యాచ్‌ల్లో 16.33 సగటుతో కేవలం 196 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలోనే ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడిన హర్భజన్ మయాంక్‌పై స్పందించాడు.
'ఈ సీజన్‌లో మయాంక్ గురించి మాట్లాడాల్సి వస్తే.. అతడికి ఏమైందోనని బాధపడ్డా. అతడెంతో మేటి ఆటగాడు. అయితే, కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక మానసికంగా ఒత్తిడికి గురైనట్లు ఉన్నాడు. ఓపెనింగ్ బ్యాటింగ్ చేయాల్సిన అతడు నాలుగో స్థానంలో ఆడాడు. జట్టును కూడా బయటి నుంచి నడిపించారు. అతడు కెప్టెన్‌గా అన్నీ చూసుకుంటున్నాడంతే. ఈ క్రమంలోనే తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు కనిపించాడు. అతడికి కెప్టెన్‌గా స్వేచ్ఛనివ్వాల్సింది. కానీ, మయాంక్ ప్రత్యేకనిఘాలో ఉన్నట్లు అనిపించాడు' అని హర్భజన్ వివరించాడు. ఇదే కార్యక్రమంలో మాట్లాడిన మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా.. ఈసారి కెప్టెన్సీ అతడి ప్రదర్శనపై ప్రభావం చూపించిందని అన్నాడు.