Ind vs Eng Test Match: ఇంగ్లాండ్‌తో అయిదో టెస్టును తొలి రోజు పేలవంగా ఆరంభించినప్పటికీ, తర్వాత గొప్పగా పుంజుకున్న టీమ్‌ఇండియా.. రెండో రోజు కూడా ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం చలాయించింది. కెరీర్లో తొలిసారి జట్టు పగ్గాలందుకున్న జస్‌ప్రీత్ బుమ్రా.. బ్యాటుతో చెలరేగి, బంతితో విజృంభించి భారత్‌కు పైచేయి సాధించే అవకాశం కల్పించాడు. జడేజా (104; 194 బంతుల్లో 134) సెంచరీకి.. బుమ్రా (31 నాటౌట్; 16 బంతుల్లో 44, 26) మెరుపులు తోడవడంతో స్కోరు 400 దాటింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 416 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లిష్ బౌలర్లలో అండర్సన్ (5/60) ఉత్తమ ప్రదర్శన చేశాడు. అనంతరం బుమ్రా (3/35) బంతితోనూ అదరగొట్టడంతో ఇంగ్లాండ్ 84/5తో కష్టాల్లో పడింది. కీలకమైన రూట్ (31) వికెట్‌ను సిరాజ్ (1/5) పడగొట్టాడు. 5 వికెట్లు చేతిలో ఉన్న ఇంగ్లిష్ జట్టు.. ఇంకా 332 పరుగులు వెనుకబడి ఉంది. ఆట ఆఖరుకు బెయిర్‌స్టో (12), స్టోక్స్ (0) క్రీజులో ఉన్నారు.
అదే ఊపులో మూడు:బ్యాటుతో ఊహించని రీతిలో చెలరేగిన బుమ్రా.. ఆ ఊపును బౌలింగ్‌లోనూ కొనసాగించాడు. ఓవైపు పదే పదే అంతరాయం కలిగిస్తూ వరుణుడు చికాకు పెడుతుంటే.. ఇంకోవైపు ఆటకు అవకాశం దొరికినపుడల్లా బుమ్రా చెలరేగాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే అతను ఓపెనర్ లీస్ (6)ను బౌల్డ్ చేశాడు. బ్యాట్, ప్యాడ్ మధ్య ఖాళీలో దూసుకెళ్లిన లెంగ్త్ బాల్.. స్టంప్స్‌ను లేపేసింది. తర్వాత క్రాలీ (9), పోప్ (10)లను ఆఫ్‌స్టంప్ ఆవల బంతులేసి స్లిప్ క్యాచ్‌లతో పెవిలియన్ చేర్చాడు బుమ్రా. 44/3తో ఇబ్బందుల్లో పడ్డ ఇంగ్లాండ్‌ను బెయిర్‌స్టోతో కలిసి రూట్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఫామ్‌ను కొనసాగిస్తూ రూట్ ఆత్మవిశ్వాసంతో ఆడుతుంటే.. బెయిర్‌స్టో ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. కానీ ఆట కాసేపట్లో ముగుస్తుందనగా సిరాజ్ జట్టును సంబరాల్లో ముంచెత్తాడు. అత్యంత కీలకమైన రూట్ వికెట్ పడగొట్టాడు. బంతి ఎడ్జ్ తీసుకుని పంత్ చేతుల్లో పడడంతో రూట్ నిరాశగా పెవిలియన్‌కు కదిలాడు. కాసేపటికే నైట్‌వాచ్‌మన్ లీచ్ (0)ను షమి ఔట్ చేశాడు. అంతకుముందే షమి బౌలింగ్‌లో కోహ్లి కష్టమైన క్యాచ్ వదిలేసినా.. లీచ్ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు.
ఇంకో 78: తొలి రోజు ఒక దశలో 98/5తో నిలిచిన భారత్.. పంత్, జడేజా పోరాటంతో 320/5తో తిరుగులేని స్థితికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ దశలో పంత్ ఔటవడం, వెంటనే శార్దూల్ కూడా వెనుదిరగడంతో ఆట ఆఖరుకు స్కోరు 338/7. జడేజా 83 పరుగులతో నాటౌట్‌గా మిగిలినా.. మిగతా లోయరార్డర్‌తో అతను ఎంత వరకు ఇన్నింగ్స్‌ను తీసుకెళ్తాడో అన్న సందేహాల నడుమ భారత్ ఇంకో 50 పరుగులు జోడించినా ఎక్కువే అనుకున్నారు అభిమానులు. కానీ ఇంకో 78 పరుగులు జోడించి కానీ మిగతా మూడు వికెట్లు కోల్పోలేదు టీమ్‌ఇండియా. జడేజా తొలి రోజు జోరును కొనసాగిస్తూ.. టెస్టుల్లో మూడో సెంచరీని పూర్తి చేసుకోగా, ఎంతో ఓపికతో బ్యాటింగ్ చేసిన షమి నుంచి అతడికి చక్కటి సహకారం అందింది. ఎనిమిదో వికెట్ కోసం ఇంగ్లాండ్ దాదాపు గంట పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. చివరికి షమి.. బ్రాడ్ బౌలిం గ్‌లో థర్డ్ మ్యాన్ దిశగా షాట్ ఆడి వెనుదిరిగాడు. కాసేపటికే జడేజాను అండర్సన్ బౌల్డ్ చేశాడు. 375/9కు చేరుకున్న భారత్ ఇన్నింగ్స్‌ను ముగించడం లాంఛనమే అనిపించింది. కానీ బుమ్రా.. బ్రాడ్ బౌలింగ్‌లో అనూహ్యంగా చెలరేగిపోయి రికార్డు పరుగులు సాధించడంతో భారత్ స్కోరు 400 దాటింది. ఆ తర్వాతి ఓవర్లోనే సిరాజ్‌ను ఔట్ చేసిన అండర్సన్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: శుభ్‌మన్ (సి) క్రాలీ (బి) అండర్సన్ 17; పుజారా (సి) క్రాలీ (బి) అండర్సన్ 13; విహారి ఎల్బీ (బి) పాట్స్ 20; కోహ్లి (బి) పాట్స్ 11; పంత్ (సి) క్రాలీ (బి) రూట్ 146; శ్రేయస్ (సి) బిల్లింగ్స్ (బి) అండర్సన్ 15; జడేజా (బి) అండర్సన్ 104; శార్దూల్ (సి) బిల్లింగ్స్ (బి) స్టోక్స్ 1; షమి (సి) లీచ్ (బి) బ్రాడ్ 16; బుమ్రా నాటౌట్ 31; సిరాజ్ (సి) బ్రాడ్ (బి) అండర్సన్ 2; ఎక్స్‌ట్రాలు 40 మొత్తం: (84.5 ఓవర్లలో ఆలౌట్) 416; వికెట్ల పతనం: 1-27, 2-46, 3-64, 4-71, 5-98, 6-320, 7-323, 8-371, 9-375; బౌలింగ్: అండర్సన్ 21.5-4-60-5; బ్రాడ్ 18-3-89-1; పాట్స్ 20-1-105-2; లీచ్ 9-0-71-0; స్టోక్స్ 13-0-47-1; రూట్ 3-0-23-1