ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఆరంభంలో వరుస ఓటములు ఎదుర్కొన్న ముంబయి.. ఆ తర్వాత పుంజుకుని లీగ్ స్టేజ్‌లో రాణించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడడంతో నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్ చేరింది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ను ఓడించి క్వాలిఫయర్ 2కు చేరింది. ఇక ఇందులో గెలిస్తే తుదిపోరుకు వెళ్తుంది. అక్కడ కూడా చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిస్తే.. టైటిల్‌ను ముద్దాడి రికార్డుకెక్కుతుంది. అంటే ట్రోఫీకి రెండు అడుగుల దూరంలో ఉందన మాట. అభిమానులు ముంబయి గెలవాలని ఆశిస్తున్నారు.
గెలిస్తే రెండు రికార్డులు.. ఇప్పటివరకు 6 సార్లు ఫైనల్స్ ఆడి.. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి.. తాజా సీజన్లోనూ గెలిస్తే.. అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. అయితే దీంతో పాటు మరో విషయంలోనూ రోహిత్ సేన రికార్డుకెక్కే అవకాశముంది. అదేంటంటే.. ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు ప్లే ఆఫ్స్‌కు చేరిన నాలుగో టీమ్.. ట్రోఫిని ముద్దాడలేదు.
ప్లే ఆఫ్స్‌కు చేరిన ఫస్ట్ టీమ్ మూడు సార్లు(2017, 2019, 2020) టైటిల్‌ను దక్కించుకుంది. ఆ ఘనత ముంబయిదే. ఇక రెండో జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్(2011, 2018, 2021) మూడు సార్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ (2012, 2014) రెండు సార్లు, ముంబయి ఇండియన్స్(2013, 2015) రెండు సార్లు ట్రోఫీని ముద్దాడాయి. మూడో జట్టుగా వెళ్లిన సన్‌రైజర్స్ ఒక్క సారి(2016) ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ఈ సీజన్‌లో నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్‌కు చేరిన ముంబయి.. ఒకవేళ అభిమానులు ఆశించినట్టు టైటిల్ గెలిస్తే మాత్రం.. నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించి.. ట్రోఫీని అందుకున్న ఫస్ట్ టీమ్‌గా రికార్డు కెక్కుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..