భారతీయులకు కలిగిన కష్టం త్వరలోనే సమసిపోతుందని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. కొవిడ్ రెండో వేవ్ త్వరలోనే ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. దయచేసి అంతా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఈ మేరకు అతడు హిందీలో ట్వీట్ చేశాడు.
నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ కోసం పీటర్సన్ భారత్‌కు వచ్చాడు. ఇక్కడ జరిగే మ్యాచులకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. అంతేకాకుండా విశ్లేషణ చేశాడు. లీగు వాయిదా పడటంతో అతడు ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయాడు. భారత్‌ను తానెంతగానే ప్రేమిస్తున్నానని చెప్పాడు. మిగిలిన ఐపీఎల్ సీజన్‌ను ఇంగ్లాండ్‌లోనే నిర్వహించాలని కోరాడు.
"నేను భారత్ నుంచి వచ్చేసుండొచ్చు. కానీ నేనిప్పటికీ దాని గురించే ఆలోచిస్తున్నా. ఆ దేశం నాకెంతో ప్రేమ, అనురాగాలను పంచింది. అక్కడి ప్రజలు క్షేమంగా ఉండాలి. ఈ పరిస్థితి (రెండో వేవ్) గడిచిపోతుంది. ప్రజలు మాత్రం ఎప్పటికీ అప్రమత్తంగానే ఉండాలి" అని పీటర్సన్ హిందీలో ట్వీట్ చేశాడు.
కలిసి కట్టుగా ఉంటే
నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్‌ను సెప్టెంబరులో నిర్వహిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ మిగిలిపోయిన మ్యాచ్‌ల్లో తమ దేశ ఆటగాళ్లు ఆడకపోవచ్చని తెలిపారు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ యాష్లే గైల్స్. అంతర్జాతీయ క్రీడా క్యాలెండర్ దృష్ట్యా.. బోర్డుతో సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న క్రికెటర్లు ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్.. లీగ్‌లో పాల్గొనబోరని వెల్లడించారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన పీటర్సన్.. ఇంగ్లాండ్ ఉత్తమ ఆటగాళ్లంతా కలిసి కట్టుగా ఉండి ఐపీఎల్ ఆడతామని చెప్తే.. బోర్డు వెనక్కి తగ్గే అవకాశాలున్నాయని చెప్పాడు. "ఒకవేళ ఐపీఎల్ నిర్వహిస్తే ఉత్తమ ప్లేయర్స్‌ను పంపకుండా ఈసీబీ.. ఎలా హ్యండిల్ చేస్తుందో ఆసక్తికరంగా ఉండనుంది" అని అన్నాడు.