Ricky Ponting: దిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాపై ఆ జట్టు కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. పృథ్వీ ఆట చూస్తుంటే తన ఆటే గుర్తుకు వస్తుందని ఇటీవలే దిల్లీ క్యాపిటల్స్ పాడ్‌కాస్ట్‌లో అన్నాడు. ఐపీఎల్ 2022లో గత రెండు మ్యాచ్‌ల్లో అర్ధశతకాలతో అదరగొట్టాడు పృథ్వీ. 2018 నుంచి దిల్లీకి ఆడుతున్న పృథ్వీని మెగా వేలానికి ముందు ఆ జట్టు రిటెయిన్ చేసుకుంది.
"పృథ్వీ ఆటతీరు చూస్తుంటే అతడికి నా అంత ప్రతిభ ఉందనిపిస్తుంది. అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. టీమ్ఇండియా తరఫున 100 టెస్టులు ఆడేలా అతడిని తీర్చిదిద్దాలనుకుంటున్నా. వీలైనంతమేర అతడు తన దేశానికి ప్రాతినిధ్యం వహించాలి."
-రిక్కీ పాంటింగ్, దిల్లీ కోచ్
నా లక్ష్యం అదే: గతంలో ముంబయి జట్టుకు కోచ్‌గా ఉన్న సమయంలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య వంటివారికి ట్రైనింగ్ ఇవ్వడం గురించీ పాంటింగ్ ప్రస్తావించాడు. "ముంబయికి కోచ్‌గా వెళ్లినప్పుడు.. రోహిత్ యువకుడు. హార్దిక్, కృనాల్ ఇంకా ఆడటం మొదలుపెట్టలేదు. నేను కోచింగ్ ఇచ్చిన ఎందరో ఆటగాళ్లు భారత్‌కు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగారు. నా లక్ష్యం కూడా అదే." అని పాంటింగ్ చెప్పాడు.
2018లో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసిన పృథ్వీ షా.. గాయాలు, ఫిట్నెస్ సమస్యలు, నిలకడలేమి ప్రదర్శనలతో జట్టులో చోటు సుస్థిరం చేసుకోలేకపోయాడు. ఇక దిల్లీ శిబిరంలోకి డేవిడ్ వార్నర్ రాకతో ఆ జట్టు టాప్ ఆర్డర్ బలం పెరిగింది. కోల్‌కతాపై మ్యాచ్‌లో షా-వార్నర్ కలిసి 93 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. ఆ జట్టుకు అద్భుత ఆరంభాన్ని అందించారు.
ఇదీ చూడండి:చెలరేగిన షా, వార్నర్.. ఆఖర్లో 'లార్డ్' మెరుపులు.. కోల్‌కతా ముందు భారీ లక్ష్యం