Hardik Pandya Injury: ఐపీఎల్ 2022లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది. గత రాత్రి రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో అదరగొట్టిన హార్దిక్ పాండ్య గుజరాత్‌కు భారీ స్కోరు అందించాడు. ఆ తర్వాత మెరుపు ఫీల్డింగ్‌తో రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్‌ను రనౌట్ చేశాడు. బౌలింగ్‌లోనూ రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే గాయం భయం మాత్రం అతడిని ఇంకా వెంటాడుతోంది.
రాజస్థాన్ బ్యాటింగ్ సమయంలో.. 19వ ఓవర్ వేసేందుకు వచ్చిన హార్దిక్ కోటా పూర్తి చేయలేకపోయాడు. తొడకండరాల సమస్యతో కేవలం మూడు బంతులే వేసి మైదానాన్ని వీడాడు. ఆ ఓవర్‌ను విజయ్ శంకర్ పూర్తి చేశాడు. అయితే గాయాలు, ఫిట్‌నెస్‌లేమితో.. హార్దిక్ చాలా కాలంగా టీమ్ఇండియాకు ఆడట్లేదు. ఇప్పుడు ఐపీఎల్లో మళ్లీ ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో.. మ్యాచ్ అనంతరం స్పందించిన హార్దిక్ "అది చిన్న నొప్పి మాత్రమే, తీవ్రమైన గాయం ఏం కాదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని అన్నాడు.