ఈ ఏడాది పది జట్లతో టీ20 లీగ్ సరికొత్తగా మారింది. గుజరాత్, లఖ్‌నవూ లీగ్‌లో అడుగుపెట్టాయి. కానీ పాత జట్లతో పోటీపడి ఇవి ఏ మేరకు నెగ్గుకు రాగలవనే సందేహాలు కలిగాయి. ముఖ్యంగా గుజరాత్ విజేతగా నిలుస్తుందని సీజన్ ఆరంభానికి ముందు ఎవరూ ఊహించి ఉండరు. కానీ సమష్టి కృషితో, తిరుగులేని ప్రదర్శనతో, పక్కా ప్రణాళికలతో అంచనాలను దాటి అదరగొట్టింది. ముందుగానే హార్దిక్, శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్‌లను జట్టులోకి తీసుకున్న గుజరాత్.. వేలం సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇటీవల పెద్దగా ఫామ్‌లో లేకపోయినా మిల్లర్, సాహా, ఫెర్గూసన్, షమి లాంటి ఆటగాళ్లపై నమ్మకం పెట్టింది. ఫినిషర్‌గా రాహుల్ తెవాతియా ప్రతిభను గుర్తించి ఏకంగా రూ.9 కోట్లకు దక్కించుకుంది. ఇక లీగ్‌లో అడుగుపెట్టాక బ్యాటింగ్‌లో హార్దిక్ (15 మ్యాచ్‌ల్లో 487 పరుగులు), గిల్ (16 మ్యాచ్‌ల్లో 483), మిల్లర్ (16 మ్యాచ్‌ల్లో 481) జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. కొంచెం ఆలస్యంగా తుది జట్టులోకి వచ్చిన సాహా (11 మ్యాచ్‌ల్లో 317 పరుగులు).. ఆరంభం నుంచి ఆడించనందుకు జట్టు యాజమాన్యం చింతించేలా చేశాడు. బౌలింగ్‌లో పేసర్ షమి, స్పిన్నర్ రషీద్ ఖాన్ కీలక ప్రదర్శన చేశారు. ఆ జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన షమి (16 మ్యాచ్‌ల్లో 20) ఆరంభ, ఆఖరి ఓవర్లలో గొప్పగా రాణించాడు. కొన్ని మ్యాచ్‌ల్లో ఫెర్గూసన్ (13 మ్యాచ్‌ల్లో 12) కూడా సత్తా చాటాడు. ఇక మధ్య ఓవర్లలో రషీద్ ఖాన్ (16 మ్యాచ్‌ల్లో 19) ఎప్పటిలాగే తన స్పిన్‌తో మాయ చేశాడు.
హార్దిక్ 2.0:టీమ్‌ఇండియాకు మరో కపిల్‌దేవ్ అవుతాడంటూ కెరీర్ ఆరంభంలో హార్దిక్‌పై అంచనాలు పెరిగిపోయాయి. కానీ 2019లో వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత అతని ప్రదర్శన పడిపోతూ వచ్చింది. బ్యాటింగ్‌లో వైఫల్యం, బౌలింగ్ చేయలేకపోవడంతో జట్టులో చోటు పోయింది. టతీ20 లీగ్‌లోనూ ప్రదర్శన అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలో అతణ్ని జట్టులోకి తీసుకున్న గుజరాత్ ఏకంగా కెప్టెన్‌గా నియమించి ఆశ్చర్యపరిచింది. అప్పటివరకూ అతనికి సారథిగా అనుభవం లేకపోయినా జట్టు మేనేజ్‌మెంట్ తనపై పెట్టిన నమ్మకాన్ని హార్దిక్ నిలబెట్టాడు. బ్యాటర్‌గా, బౌలర్‌గా, కెప్టెన్‌గా త్రిపాత్రాభినయం పోషించాడు. బ్యాటింగ్‌లో రాణించి సహచరుల్లో స్ఫూర్తి నింపాడు. జట్టుకు అవసరమైన సమయంలో క్రీజులో నిలబడ్డాడు. జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బంతితోనూ ఆకట్టుకున్నాడు. గాయం భయంతో మధ్యలో అయిదు మ్యాచ్‌ల్లో బౌలింగ్ వేయలేకపోయాడు. కానీ ప్లేఆఫ్స్‌కు ముందు తిరిగి బంతి అందుకున్న అతను ఫైనల్లో నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా జట్టును గెలిపించే ప్రదర్శన చేశాడు. ఇక కెప్టెన్‌గానూ తనదైన ముద్ర వేశాడు. సహచరులను ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలబడ్డాడు. ఆటగాళ్లకు స్వేచ్ఛనిచ్చి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టాడు. ఈ నేపథ్యంలో భవిష్యత్ భారత కెప్టెన్ అంటూ అతణ్ని కొనియాడుతున్నారు.