ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడటం వల్లే భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నట్లు వెల్లడించాడు శ్రీలంక మాజీ క్రికెటర్ లసిత్ మలింగ. జట్టుతో తనకున్న అనుబంధం గురించి వివరించాడు. జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్లో ఆడటం యువ క్రికెటర్లందరికీ ఒక కల అని అన్నాడు.
"'అద్భుతమైన సహాయక సిబ్బంది కలిగిన ముంబయి ఇండియన్స్ జట్టులో చోటు దక్కడం అదృష్టం. ఆ ఫ్రాంచైజీ తరఫున ఆడటం వల్లే భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులను సంపాదించుకున్నా. 2008లో ముంబయి జట్టుకు ఎంపికయ్యానని నా మేనేజర్ నుంచి నాకు కాల్ వచ్చింది. అప్పటికే అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. నాతో పాటు మరో ఇద్దరు శ్రీలంక క్రికెటర్లు కూడా ముంబయి ఇండియన్స్‌కు ఎంపికయ్యారు. అప్పటికీ అంతర్జాతీయ క్రికెట్లో నాకు మూడున్నర సంవత్సరాల అనుభవం మాత్రమే ఉంది. ఐపీఎల్లో మరికొంత నేర్చుకోవడం మంచిదని అనిపించింది. అయితే దురదృష్టం కొద్ది 2008లో మోకాలి గాయంతో మెగాలీగ్కు దూరమయ్యా. అంతేగాక శ్రీలంక బోర్డు ఒప్పందాన్ని కోల్పోయా. ఇది జరిగిన ఏడాదిన్నరకు నేను క్రికెట్ ఆడాలంటే షార్ట్ ఫార్మాట్లతో ప్రారంభించాలని డాక్టర్లు, ఫిజియోలు సూచించారు. అంటే టీ20లు ఆడాల్సి ఉంటుంది. అయితే జాతీయ జట్టుకు ఆడాల్సి ఉన్నప్పటికీ నా పరిస్థితి అర్థం చేసుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు ఐపీఎల్లో ఆడేందుకు అనుమతించింది."