తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధనాధన్‌ బ్యాటింగ్‌.. ఈ ఐపీఎల్ సీజన్‌లో రికార్డు అర్ధశతకాలివే - ఐపీఎల్ 2022

ఐపీఎల్​ రసవత్తరంగా సాగిపోతోంది. చెన్నై, ముంబయి మినహా అన్ని జట్లూ ఈ సీజన్​లో మంచి ప్రదర్శన చేస్తున్నాయి. కోల్‌కతా ఆటగాడు ప్యాట్‌ కమిన్స్‌ అనూహ్యంగా 14 బంతుల్లోనే అర్ధశతకం బాది రికార్డుకెక్కాడు. మరి ఈ జాబితాలో ఇంకెవరెవరు ఉన్నారంటే..?

fastest 50s in ipl 2022
fastest 50s in ipl 2022

By

Published : Apr 16, 2022, 12:52 PM IST

భారత టీ20 లీగ్‌లో ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. చెన్నై, ముంబయి మినహా అన్ని జట్లూ ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు బ్యాట్స్‌మన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగుతున్నారు. అలా ఇప్పటివరకు వేగవంతమైన అర్ధశతకాలు సాధించిన టాప్‌ 10 బ్యాట్స్‌మెన్‌ ఎవరో ఓ లుక్కేద్దాం..

* ప్యాట్‌ కమిన్స్‌:కోల్‌కతా ఆటగాడు ప్యాట్‌ కమిన్స్‌ ముంబయితో జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. కేవలం 14 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకొని ఈ సీజన్‌లో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ సాధించాడు. అదే సమయంలో ఈ లీగ్‌ చరిత్రలో 14 బంతుల్లోనే ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. కేఎల్‌ రాహుల్‌ 2018లో తొలిసారి ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో కమిన్స్‌ 4 ఫోర్లు, 6 సిక్సర్లు సాధించి మొత్తం 56 పరుగులు చేసి కోల్‌కతాను గెలిపించాడు.

కమిన్స్

* రాహుల్‌ త్రిపాఠి:హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ త్రిపాఠి గతరాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 21 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. దీంతో ఈ సీజన్‌లో రెండో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అందులో 4 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. మొత్తంగా 71 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

త్రిపాఠి

* లియామ్‌ లివింగ్‌స్టోన్‌:పంజాబ్‌ ఆటగాడు లియామ్‌ లివింగ్‌స్టోన్‌ కూడా 21 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. దీంతో వేగవంతమైన అర్ధశతకం బాదిన ఆటగాడిగా ప్రస్తుతం మూడో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అతడు 7 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. మొత్తం 64 పరుగులు చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ గెలవడం కొసమెరుపు.

లివింగ్​స్టోన్

* జోస్‌బట్లర్‌:రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ ఈ సీజన్‌లో జోరుమీదున్నాడు. ఇప్పటికే ఒక శతకం, రెండు అర్ధశతకాలతో టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే గుజరాత్‌తో ఆడిన మ్యాచ్‌లో 23 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. అందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు దంచికొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 54 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ విజయం సాధించింది.

బట్లర్

* ఎవిన్‌ లూయిస్‌:లఖ్‌నవూ ఆటగాడు ఎవిన్‌ లూయిస్‌ సైతం 23 బంతుల్లోనే ఈ సీజన్‌లో వేగవంతమైన అర్ధశతకం సాధించాడు. చెన్నైతో తలపడిన మ్యాచ్‌లో అతడు దంచికొట్టి ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. అందులో 6 ఫోర్లు, 3 సిక్సర్లు సంధించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి తన జట్టును గెలిపించాడు.

లూయిస్

* సంజూ శాంసన్‌:రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ ఈ సీజన్‌లో 25 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేసి ఈ జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అందులో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో మొత్తం 55 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ విజయం సాధించింది.

శాంసన్

* రాబిన్‌ ఉతప్ప:ఇప్పటివరకు జరిగిన సీజన్‌లో చెన్నై పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆ జట్టు బ్యాట్స్‌మన్‌ రాబిన్‌ ఉతప్ప మంచి ఫామ్‌లో ఉన్నాడు. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో అతడు 25 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించి ఔటయ్యాడు. దీంతో ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. అందులో మొత్తం 8 ఫోర్లు, 1 సిక్సర్‌ సాధించాడు. ఆ మ్యాచ్‌లో చెన్నై 210 పరుగుల భారీ స్కోర్‌ చేసినా ఓటమిపాలైంది.

ఉతప్ప

* శివమ్‌దూబే:మరో చెన్నై ఆటగాడు శివమ్‌దూబే. ప్రస్తుత సీజన్‌లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అతడు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. దీంతో ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. అందులో 6 ఫోర్లు, 3 సిక్సర్లు దంచికొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో దూబే 57 పరుగులు చేశాడు. ఇక్కడ కూడా చెన్నై ఓటమిపాలవ్వడం గమనార్హం.

దూబే

* పృథ్వీషా:దిల్లీ ఓపెనర్‌ పృథ్వీషా ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. కోల్‌కతాతో ఆడిన మ్యాచ్‌లో అతడు 27 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. అందులో 7 ఫోర్లు, 2 సిక్సర్లు నమోదు చేశాడు. మొత్తం 51 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో దిల్లీ 215 పరుగుల భారీ స్కోర్‌ చేయగా కోల్‌కతా అంత మొత్తం ఛేదించలేక ఓటమిపాలైంది.

పృథ్వీ షా

* ఆండ్రీ రసెల్‌:కోల్‌కతా సూపర్‌ హిట్టర్‌ ఆండ్రీ రసెల్ ఈ జాబితాలో పదో స్థానంలో ఉన్నాడు. అతడు పంజాబ్‌తో ఆడిన మ్యాచ్‌లో 27 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అందులో 2 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండటం విశేషం. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి కోల్‌కతాను గెలిపించాడు.

రసెల్

ఇదీ చదవండి:ఐపీఎల్ నుంచి చాహర్ ఔట్.. రూ. 14 కోట్లు చెల్లిస్తారా?

ABOUT THE AUTHOR

...view details