బెంగళూరు వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చాలా బలంగా తిరిగిరావడం గొప్పగా ఉందని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రశంసించాడు. తాజాగా కార్తీక్ టీమ్‌ఇండియాకు ఎంపికైన నేపథ్యంలో అతడి గురించి అక్తర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'దినేశ్ కార్తీక్ జట్టులోకి తిరిగి రావడం గొప్పగా ఉంది' - shoaib akhtar about dinesh karthik
దినేశ్ కార్తీక్ తిరిగి టీమ్‌ఇండియాకు ఎంపిక కావడంపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న కార్తీక్.. భారత జట్టులోకి రావడం గొప్పగా ఉందన్నారు.
'నేను సహజంగా ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడను. ఇక్కడ చెప్పదల్చుకున్న విషయం ఒక్కటే. కార్తీక్ జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు. అయినా, బలంగా తిరిగొచ్చాడు. తన వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందో నేను స్వతహాగా చదివి తెలుసుకున్నా. దీంతో అతడు తిరిగొచ్చిన విధానం నన్నెంతగానో ఆకట్టుకుంది. అతడు చాలా గొప్ప పని చేశాడని చెప్పొచ్చు. పరిపక్వత అంటే ఇదే. నేను ఆడే రోజుల నుంచి అతడు ఆడుతున్నాడు. మానసికంగా, శారీరకంగా చాలా దృఢంగా ఉన్నాడు. మంచి వారికి అంతా మంచే జరుగుతుంది. అతడు మళ్లీ టీమ్‌ఇండియాకు ఎంపికవ్వడం చాలా గొప్పగా ఉంది. నా తరఫున అభినందనలు' అని అక్తర్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి:బట్లర్ రికార్డు సెంచరీ.. ఆర్సీబీకి మళ్లీ నిరాశే.. ఫైనల్లో గుజరాత్‌తో రాజస్థాన్ ఢీ