చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లేనిదే తన కెరీర్ లేదని వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో అన్నాడు. తాను క్రికెట్ కెరీర్లో ఎదిగేందుకు ధోనీ వ్యక్తిగతంగా చాలా సహాయపడ్డాడని పేర్కొన్నాడు. ఐపీఎల్లో చెన్నై జట్టుతో తమ బంధం విడదీయలేనిదని చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ వార్తా సంస్థతో మాట్లాడిన బ్రావో పలు విషయాలు వెల్లడించాడు.
‘వచ్చే సీజన్ కోసం చెన్నై యాజమాన్యం నన్ను అట్టి పెట్టుకోలేదు. వేలంలో మళ్లీ నన్ను దక్కించుకుంటుందని కూడా కచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతం నేను వేలంలో ఉన్నాను. ఏ జట్టు కొనుగోలు చేస్తుందో తెలియదు. చెన్నై కెప్టెన్ ధోనీతో నా అనుబంధం ఎలాంటిదో మీకందరికీ తెలుసు. ఒకరినొకరం బ్రదర్ అని పిలుచుకునే వాళ్లం. ధోనీ లేనిదే నా కెరీర్ లేదు. నా క్రికెట్ కెరీర్ ఎదుగుదలకు ధోనీ వ్యక్తిగతంగా చాలా తోడ్పడ్డాడు. చెన్నై జట్టుతో మా అనుబంధం విడదీయలేనిది’ అని బ్రావో పేర్కొన్నాడు.