గతేడాది ఐపీఎల్ ఆరంభానికి ముందు అంతర్జాతీయ క్రికెట్లో శిఖర్ ధావన్ పనైపోయిందన్న అభిప్రాయాలు బలంగా వినిపించాయి. బ్యాటింగ్‌లో నిలకడ లేమి, ఫిట్నెస్ సమస్యలకు తోడు వయసు పెరిగిపోవడం అతడికి ప్రతికూలతలుగా కనిపించాయి. కుర్రాళ్ల జోరు ముందు అతను నిలవలేడని, టీమ్ఇండియాలో చోటు నిలుపుకోవడం కష్టమే అని తేల్చేశారు చాలామంది. కానీ యూఏఈలో జరిగిన ఐపీఎల్లో ఈ సీనియర్ ఓపెనర్ చెలరేగిపోయాడు. ఒకటికి రెండు శతకాలు బాదేశాడు. మొత్తం 618 పరుగులతో ఆ ఐపీఎల్ టాప్స్కోరర్లలో రెండో స్థానం సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా పర్యటనకు తనను ఎంపిక చేయక తప్పని పరిస్థితి సెలక్టర్లకు కల్పించాడతను. ఆ పర్యటనలో ఓ మోస్తరు ప్రదర్శన చేసిన ధావన్‌పై స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో జట్టు యాజమాన్యం శీతకన్నేసింది.
ఒక మ్యాచ్‌లో ఆడించి పక్కన పెట్టేసింది. అయితేనేం ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో అతను అదరగొట్టాడు. ఒక మ్యాచ్‌లో 98 పరుగులు, మరో మ్యాచ్‌లో 67 పరుగులు చేశాడు. అయినప్పటికీ టీ20 జట్టులో అతడికి స్థానం కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో సూర్యకుమార్, కిషన్ లాంటి కుర్రాళ్ల జోరు చూస్తే భారత జట్టు టీ20 ప్రపంచకప్ ప్రణాళికల నుంచి ధావన్‌ను తప్పించడం ఖాయమనే అనిపించింది. కానీ ఇప్పుడు ఐపీఎల్లో ధావన్ చెలరేగుతున్న తీరు చూస్తే.. అతను అంత తేలిగ్గా తన స్థానాన్ని వదిలేలా లేడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే (చెన్నైపై) 85 పరుగులు చేసిన ధావన్.. చెన్నైతో గత మ్యాచ్‌లో 92 పరుగులు సాధించడం విశేషం.