ఆటగాళ్లకు కరోనా సోకడం వల్ల బీసీసీఐకి.. ఐపీఎల్ 2021ను రద్దు చేయక తప్పలేదు. 2020 టోర్నీ లాగే ఈ ఐపీఎల్‌ను కూడా యూఏఈలో నిర్వహించాలన్న ఐపీఎల్ పాలకవర్గం ప్రతిపాదనను బోర్డు తిరస్కరించి ఉండకపోతే ఈ పరిస్థితి తలెత్తేది కాదేమో! ఏప్రిల్ 9న ఐపీఎల్ ఆరంభానికి వారం ముందు.. టోర్నీ మొత్తాన్ని యూఏఈకి తరలించాలని ఐపీఎల్ పాలకవర్గం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ టోర్నమెంట్ కావడం వల్ల రెండో దశ కరోనా వల్ల పరిస్థితి చేజారిపోయే అవకాశమున్నట్లు బ్రిజేష్ పటేల్ నాయకత్వంలోని పాలకవర్గం భయపడింది. కనీసం నాలుగు ఫ్రాంఛైజీలు కూడా పాలకవర్గ ప్రతిపాదనకు మద్దతు తెలిపాయి. కానీ బీసీసీఐ పట్టించుకోలేదు.
"ఈ ఏడాది టోర్నీ వేదిక విషయంలో ఐపీఎల్ పాలకవర్గం తొలి ప్రాధాన్యం ఎప్పుడూ యూఏఈకే. లీగ్ ప్రారంభానికి వారం ముందు కూడా టోర్నీ మొత్తాన్ని యూఏఈకి తరలించాలని బోర్డును కోరింది. యూఏఈ క్రికెట్ బోర్డు కూడా తక్కువ సమయంలోనే ఏర్పాట్లు చేయడానికి సుముఖత వ్యక్తం చేసింది. కానీ బీసీసీఐలో ఎవరూ ఈ ప్రతిపాదనను పెద్దగా పట్టించుకోలేదు. ప్రతి ఒక్క అధికారి కూడా మరొకరి అభిప్రాయం కోసం ఎదురు చూశారు. చివరికి ప్రతిపాదనను తిరస్కరించారు" అని ఓ ఐపీఎల్ అధికారి చెప్పాడు.