చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ 19.4 ఓవర్లలో ఛేదించింది. దిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ (39) రాణించాడు. పృథ్వీ షా (18), రిషభ్ పంత్ (15), రిపాల్ పటేల్ (18) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. శ్రేయస్ అయ్యర్ (2), అక్షర్ పటేల్ (5) విఫలమయ్యారు. ఆఖర్లో వచ్చిన షిమ్రోన్ హెట్‌మైర్ (28), రబాడ (4) పరుగులతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 2, శార్ధూల్ ఠాకూర్ 2, దీపక్ చాహర్, జోష్ హేజిల్ వుడ్, డ్వేన్ బ్రావో తలో వికెట్ తీశారు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. అంబటి రాయుడు (55) అర్ధ శతకంతో రాణించాడు. చివరి ఓవర్లలో రాయుడు వేగం పెంచడంతో దిల్లీ ముందు చెన్నై మోస్తరు లక్ష్యాన్ని ఉంచగలిగింది. రాబిన్ ఉతప్ప (19), కెప్టెన్ ధోని (18) ఫర్వాలేదనిపించారు.