దిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ ఎట్టకేలకు క్రికెట్ స్టేడియంలో అడుగుపెట్టబోతున్నాడు! అయితే మ్యాచ్ ఆడటానికి కాదండోయ్.. చూడటానికి మాత్రమే. గతేడాది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. కాస్త లేచి స్టిక్ సాయంతో నడుస్తూ.. తన పని తానే చేసుకోగలుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడతడిని... దిల్లీ క్యాపిటల్స్-గుజరాత్ టైటన్స్ మధ్య జరగబోయే మ్యాచ్‌కు తీసుకొచ్చేందుకు దిల్లీ ఫ్రాంఛైజీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అతడు ప్రత్యేక్షంగా చూసేందుకు వస్తున్నాడు.
ఈ మ్యాచ్ నేడు(ఏప్రిల్ 4) దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనుంది. అతడు ఈ సీజన్‌కు దూరమవ్వడంతో అతడి స్థానంలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్ చూడటానికి పంత్ రాబోతున్నట్లు దిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) జాయింట్ సెక్రటరీ రాజన్ చెప్పారు. గాయంతో బాధపడుతున్నా.. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని పంత నిర్ణయించుకున్నాడని ఆయన వెల్లడించారు. అతడు ఫ్రాంఛైజీ యజమానుల ప్రాంతం నుంచి మ్యాచ్‌ను చూసే అవకాశం ఉందట. బీసీసీఐ అవినీతి నిరోధక, సెక్యూరిటీ టీమ్ ఓకే అంటే.. అతడు కొంత సమయం డగౌట్‌లో కూడా గడుపుతాడని ఆ ఫ్రాంఛైజీ వర్గాలు చెప్పాయి.