చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చాహర్ తన ప్రేయసి(deepak chahar girlfriend)కి లవ్ ప్రపోజ్ చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్(csk vs pbks 2021) సమయంలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఓవైపు చెన్నై జట్టు ఆటగాళ్లు, అభిమానులు ఓటమి బాధలో ఉంటే.. అకస్మాత్తుగా తన లేడీ లవ్‌కు మోకాలిపై కూర్చుని ప్రపోజ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు చాహర్. తాజాగా ఈ విషయంపై స్పందించిన దీపక్ వాళ్ల నాన్న లోకేంద్ర సింగ్ చాహర్.. ఈ తతంగానికి అంతటికీ కారణం ధోనీ అని తెలిపారు.
"తన ప్రేయసికి దీపక్ కొద్దిరోజుల తర్వాత ప్రపోజ్ చేద్దామని అనుకున్నాడు. ప్లే ఆఫ్స్ సమయంలో ఇది జరగాల్సింది. కానీ ధోనీ చెప్పడం వల్ల లీగ్ స్టేజ్ ఆఖరి మ్యాచ్ సమయంలో ప్రపోజ్ చేశాడు చాహర్. చాలా సంతోషంగా ఉంది. దాదాపు 180 దేశాలు ఈ సన్నివేశాన్ని టీవీల్లో ప్రత్యక్షంగా చూశాయి. దీపక్, జయ యూఏఈ నుంచి ఇంటికొచ్చాక పెళ్లి గురించి ఆలోచిస్తాం."