తెలంగాణ

telangana

ETV Bharat / sports

SRH Vs DC: అదే బలహీనత సన్‌రైజర్స్‌ను వెంటాడుతోందా? - సన్రైజర్స్ హైదరాబాద్

దిల్లీది అదే జోరు. బ్యాటుతో, బంతితో అదే ఆధిపత్యం. తొలి అంచెను అగ్రస్థానంతో ముగించిన ఆ జట్టు రెండో అంచెనూ ఘనంగా ఆరంభించింది. ఆల్‌రౌండ్‌ సత్తా చాటుతూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను (SRH Vs DC) చిత్తుగా ఓడించింది. ఏడో విజయంతో దిల్లీ ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. సన్‌రైజర్స్‌ ఎప్పటిలాగే పేలవ బ్యాటింగ్‌తో భంగపడింది. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడో ఓటమి చవిచూసిన ఆ జట్టు ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించినట్లే!

srh vs dc
ఐపీఎల్

By

Published : Sep 23, 2021, 6:43 AM IST

విజయంతో రెండో అంచెను (IPL 2021) మొదలెట్టిన దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై (SRH Vs DC) విజయం సాధించింది. రబాడ (3/37), 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' నార్జ్‌ (2/12), అక్షర్‌ పటేల్‌ (2/21) ధాటికి మొదట సన్‌రైజర్స్‌ 9 వికెట్లకు 134 పరుగులే చేయగలిగింది. 28 పరుగులు చేసిన సమద్‌ టాప్‌ స్కోరర్‌. ధావన్‌ (42; 37 బంతుల్లో 6×4, 1×6), శ్రేయస్‌ అయ్యర్‌ (47 నాటౌట్‌; 41 బంతుల్లో 2×4, 2×6), కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (35 నాటౌట్‌; 21 బంతుల్లో 3×4, 2×6) మెరవడం వల్ల లక్ష్యాన్ని దిల్లీ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇప్పటివరకు ఒకే మ్యాచ్‌లో నెగ్గిన సన్‌రైజర్స్‌.. ప్లేఆఫ్స్‌ రేసులో ఉండాలంటే మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. అప్పుడు కూడా చాలా సమీకరణాలపై ఆధారపడాల్సిన పరిస్థితి రావొచ్చు. కాబట్టి పేలవ ప్రదర్శన చేస్తున్న సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌కు దూరమైనట్లే!

పంత్‌ ధనాధన్‌..

ఓపెనర్‌ పృథ్వీషా(11)ను త్వరగానే కోల్పోయినా ఛేదనలో దిల్లీకి బలమైన పునాదే పడింది. శ్రేయస్‌తో కలిసి ధావన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ధావన్‌ వీలైనప్పుడల్లా బౌండరీలు సాధించాడు. శ్రేయస్‌ ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. స్కోరు వేగం ఎక్కువ లేకున్నా సాధించాల్సిన రన్‌రేట్‌ కూడా మరీ ఎక్కువేమీ లేకపోవడం వల్ల దిల్లీకి కంగారుపడాల్సిన అవసరం లేకపోయింది. 11వ ఓవర్లో ధావన్‌ను రషీద్‌ ఔట్‌ చేసేటప్పటికి స్కోరు 72. పంత్‌ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ పరుగులు అంత తేలిగ్గా ఏమీ రాలేదు. సాధించాల్సిన రన్‌రేట్‌ ఏడు దాటింది. 15 ఓవర్లకు స్కోరు 99/2.

సన్‌రైజర్స్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండడం వల్ల మ్యాచ్‌ కాస్త ఆసక్తికరంగా మారింది. చివరి 5 ఓవర్లలో దిల్లీ 36 పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ పంత్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. భువి వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్లో సిక్స్‌ బాదిన పంత్‌.. ఖలీల్‌ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 4, 6 బాదేయడం వల్ల మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. 17వ ఓవర్లలో 126/2తో నిలిచిన దిల్లీకి.. ఆ తర్వాత గెలుపు లాంఛనమే అయింది.

తడబడిన సన్‌రైజర్స్‌

సన్‌రైజర్స్‌కు ఎప్పుడూ బ్యాటింగే సమస్య. ఇప్పుడు యూఏఈలోనూ అదే బలహీనత సన్‌రైజర్స్‌ను వెంటాడింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నా.. పరుగుల వేటలో వెనుకబడి పోయింది. ఆరంభమే ఆ జట్టుకు పెద్ద షాక్‌. ఖాతా అయినా తెరవకుండానే స్టార్‌ ఓపెనర్‌ వార్నర్‌ను కోల్పోయింది. అయిదో ఓవర్లో సాహా (18) నిష్క్రమించేటప్పటికి స్కోరు 29. విలియమ్సన్‌ (18; 26 బంతుల్లో 1×4), అతడికి తోడుగా మనీశ్​ పాండే (17; 16 బంతుల్లో 1×4) నిలిచినా పరుగులు వేగంగా రాలేదు.

ఇద్దరూ జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేశారు. విలియమ్సన్‌ తన తొలి 20 బంతుల్లో 16 పరుగులే చేశాడు. 9 ఓవర్లకు స్కోరు 58/2. అయితే గేరు మార్చి, జోరు పెంచాల్సిన దశలో నిలదొక్కుకున్నట్లు కనిపించిన బ్యాట్స్‌మెన్‌ ఇద్దరూ ఔట్‌ కావడం వల్ల సన్‌రైజర్స్‌ చిక్కుల్లో పడింది. దీంతో సన్‌రైజర్స్‌ 61/4తో నిలిచింది. సమద్‌, రషీద్‌ (22; 19 బంతుల్లో 2×4, 1×6) పోరాడటంతో సన్‌రైజర్స్‌ 130 దాటింది.

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌:వార్నర్‌ (సి) అక్షర్‌ (బి) నార్జ్‌ 0; సాహా (సి) ధావన్‌ (బి) రబాడ 18; విలియమ్సన్‌ (సి) హెట్‌మయర్‌ (బి) అక్షర్‌ 18; మనీష్‌ పాండే (సి) అండ్‌ (బి) రబాడ 17; కేదార్‌ జాదవ్‌ ఎల్బీ (బి) నార్జ్‌ 3; సమద్‌ (సి) పంత్‌ (బి) రబాడ 28; హోల్డర్‌ (సి) పృథ్వీ (బి) అక్షర్‌ 10; రషీద్‌ రనౌట్‌ 22; భువనేశ్వర్‌ నాటౌట్‌ 5; సందీప్‌ శర్మ రనౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 134; వికెట్ల పతనం:1-0, 2-29, 3-60, 4-61, 5-74, 6-90, 7-115, 8-133, 9-134; బౌలింగ్‌: నార్జ్‌ 4-0-12-2; అవేష్‌ ఖాన్‌ 4-0-27-0; అక్షర్‌ 4-0-21-2; రబాడ 4-0-37-3; స్టాయినిస్‌ 1.1-0-8-0; అశ్విన్‌ 2.5-0-22-0

దిల్లీ ఇన్నింగ్స్‌:పృథ్వీ షా (సి) విలియమ్సన్‌ (బి) ఖలీల్‌ 11; ధావన్‌ (సి) సమద్‌ (బి) రషీద్‌ 42; శ్రేయస్‌ అయ్యర్‌ నాటౌట్‌ 47; పంత్‌ నాటౌట్‌ 35; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (17.5 ఓవర్లలో 2 వికెట్లకు) 139; వికెట్ల పతనం:1-20, 2-72; బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4-0-33-1; భువనేశ్వర్‌ 3-0-21-0; హోల్డర్‌ 3.5-0-33-0; రషీద్‌ ఖాన్‌ 4-0-26-1; సందీప్‌ శర్మ 3-0-26-0

ఇదీ చూడండి:IPL 2021: ముంబయిని కోల్​కతా అడ్డుకోగలదా?

ABOUT THE AUTHOR

...view details