CSK vs SRH: సమష్టి ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో బోణీ కొట్టి.. పాయింట్ల ఖాతా తెరిచింది. చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అభిషేక్ శర్మ 50 బంతుల్లో 75 పరుగులతో రాణించాడు. విలియమ్సన్ 40 బంతుల్లో 32 పరుగులతో.. శర్మకు చక్కటి సహకారం అందించాడు. ఆఖర్లో త్రిపాఠి 15 బంతుల్లో 39 రన్స్‌తో చెలరేగాడు. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి, డ్వేన్ బ్రేవోకు చెరో వికెట్ దక్కింది. మిగతా బౌలర్లంతా తేలిపోయారు. చెన్నైకి ఇది ఈ సీజిన్లో వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం.
తొలుత టాస్ గెలిచిన సన్‌రైజర్స్ చెన్నైకి బ్యాటింగ్ అప్పగించింది. ఆ జట్టుకు సరైన ఆరంభం దక్కలేదు. పవర్‌ప్లేలోనే రాబిన్ ఉతప్ప(15), రుతురాజ్ గైక్వాడ్(16) వికెట్లను కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న శివం దూబే(3), ధోనీ(3) విఫలమయ్యారు. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు పలు మార్పులతో బరిలోకి దిగాయి. చెన్నైలో ప్రిటోరియస్ స్థానంలో మహేశ్ తీక్షణ జట్టులోకి వచ్చాడు. సన్‌రైజర్స్‌లో సమద్, షెఫర్డ్ స్థానంలో శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్ ఆడారు.