తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ మెరుపులు.. ప్లేఆఫ్స్‌ దిశగా సీఎస్కే.. దిల్లీపై విజయం

IPL 2023 CSK VS DC : ఐపీఎల్​ సీజన్​ 16లో భాగంగా 55వ లీగ్​ మ్యాచ్​ చెన్నైలోని చిదంబరం మైదానం వేదికగా జరిగింది. ఈ పోరులో దిల్లీ క్యాపిటల్స్​పై సీఎస్కే విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు మరింత  చేరువైంది.

IPL 2023 CSK VS DC Latest Match
IPL 2023 CSK VS DC Latest Match

By

Published : May 10, 2023, 10:57 PM IST

Updated : May 11, 2023, 6:25 AM IST

IPL 2023 CSK VS DC : ఐపీఎల్​ సీజన్​ 16లో భాగంగా 55వ లీగ్​ మ్యాచ్​ చెన్నైలోని చిదంబరం మైదానం వేదికగా జరిగింది. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి అదరగొట్టింది. సొంత మైదానంలో జరిగిన పోరులో 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకున్న సూపర్‌కింగ్స్‌ ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. ఏడో ఓటమితో డీసీ.. ప్లేఆఫ్స్‌కు దాదాపుగా దూరం అయింది. సీఎస్కే నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులే చేసింది. రిలీ రొసోవ్ 35 పరుగులతో రాణించాడు. మనీశ్ పాండే 27, అక్షర్‌ పటేల్ 21, ఫిలిప్ సాల్ట్ 17 పరుగులకే పరిమితం అయ్యారు. బౌలర్లలో పతిరణ 3 వికెట్లు పడగొట్టగా, దీపక్ చాహర్‌ 2, జడేజా ఒక వికెట్ పడగొట్టారు.

మ్యాచ్​ ఆరంభానికి ముందు టాస్​ గెలిచి తొలుత బ్యాటింగ్​ ఎంచుకున్న చెన్నై సూపర్​ కింగ్స్​ ఆశించిన స్థాయిలో మాత్రం స్కోర్​ చేయలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది ధోనీ సేన. శివమ్​ దూబె(25) టాప్​ స్కోరర్​. ఇన్నింగ్స్ ఆఖర్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్​ ధోనీ(20; 9 బంతుల్లో 1 ఫోర్​, 2 సిక్స్​లు) మెరుపులు మెరిపించాడు. రుతురాజ్​ గైక్వాడ్​(24), డేవాన్​ కాన్వే(10), అజింక్య రహానె(21), అంబటి రాయుడు(23), జడేజా(21) రాణించారు. దిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్‌ 3, అక్షర్ పటేల్ 2, కుల్‌దీప్‌, ఖలీల్‌ అహ్మద్‌, లలిత్‌ యాదవ్‌లు తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

ఈ ఇన్నింగ్స్​లో ఓపెనర్లుగా డేవాన్​ కాన్వే, రుతురాజ్​ గైక్వాడ్​ దిగారు. వీరి భాగస్వామ్యంలో ఇషాంత్​ శర్మ వేసిన రెండో ఓవర్లో ఏకంగా 16 పరుగులు రాబట్టారు. ఈ ఓవర్లో గైక్వాడ్​ ఏకంగా మూడు ఫోర్లు బాదాడు. అక్షర్​ పటేల్​ వేసిన ఐదో ఓవర్లో కాన్వే(10) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్​లోకి రావడంతోనే రెండు ఫోర్లు బాదాడు అజింక్య రహనె. 6 ఓవర్లు ముగిసేసరికి 24 పరుగులు చేసి మంచి దూకుడు మీదున్న గైక్వాడ్​ అక్షర్​ పటేల్​ వేసిన రెండో ఓవర్​లో తొలి బంతికి అమన్​ ఖాన్​కు క్యాచ్​ ఇచ్చి పెవిలియన్​ చేరాడు. అనంతరం మొయిన్​ అలీ బ్యాటింగ్​కు దిగగా 12 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి కుల్​దీప్​ వేసిన 10వ ఓవర్లో మిచెల్ మార్ష్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. సీఎస్కే ఇన్నింగ్స్​లో 10 ఓవర్లు గడిస్తేనే గానీ మొదటి సిక్స్​ నమోదు కాలేదు. మొయిన్​ ఔట్​ కావడంతో క్రీజ్​లోకి వచ్చిన శివమ్​ దూబె మిడ్​ వికెట్​ మీదుగా స్టాండ్స్​లోకి పంపి ఇన్నింగ్స్​లో మొదటి సిక్స్​ను నమోదు చేశాడు. ఇక 12వ ఓవర్లో లలిత్​ యాదవ్​ బౌలింగ్​లో రిటర్న్ క్యాచ్​ ఇచ్చి 21 పరుగులతో రహానె ఔటయ్యాడు. ఈ క్యాచ్​ను లలిత్​ ఒంటి చేత్తో పట్టుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు. అప్పటికే మంచి దూకుడు మీదున్న శివమ్​ 15 ఓవర్లో మిచెల్​ మార్ష్​ వేసిన బాల్​లో వార్నర్​కు క్యాచ్​ ఇచ్చి 12 బంతుల్లో 3 సిక్స్​లు బాది 25 పరుగుల చేసి ఔటయ్యాడు. చివరగా బ్యాటింగ్​కు దిగిన ధోనీ(20) మిచెల్​ మార్ష్​ వేసిన 19.5 ఓవర్​కు వార్నర్​కు క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు.

దిల్లీ బ్యాటింగ్​​..లక్ష్యం పెద్దది కాకపోయినా.. దిల్లీ క్యాపిటల్స్​ ఏ దశలోనూ ఛేదన దిశగా ముందుకు సాగలేదు. ఇన్నింగ్స్‌ రెండో బంతికే వార్నర్‌ (0)ను ఔట్‌ చేసిన దీపక్‌ చాహర్‌.. తన తర్వాతి ఓవర్లో సాల్ట్​ను(17) పెవిలియన్‌ చేర్చాడు. మనీష్‌తో సమన్వయ లోపంతో మిచెల్‌ మార్ష్‌ రనౌటవడంతో 25/3తో దిల్లీ కష్టాల్లో పడింది. ఈ స్థితిలో వచ్చిన రొసో, మనీష్‌ పాండే ఇన్నింగ్స్‌ను కాస్త చక్కదిద్దారు. కానీ పరుగుల వేగం పడిపోవడం వద్ద సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోయింది. అయితే అదే సమయంలో పాండే రెండు సిక్సర్లు బాది ఊపందుకున్నప్పటికీ.. 'ఇంపాక్ట్‌ ప్లేయర్‌' పతిరన.. అతడిని పెవిలియ్​కు పంపాడు. దీంతో దిల్లీ పతనానికి మళ్లీ గేట్లెత్తినట్లయింది. షాట్ల కోసం గట్టిగా ప్రయత్నించి విఫలమైన రొసో కూడా.. చివరికి జడేజా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అప్పటికే 33 బంతుల్లో 89 పరుగులు చేయాల్సి ఉండటం వల్ల దిల్లీ ఓటమి ఖరారైపోయింది. అక్షర్‌ (21), లలిత్‌ (12) ఓటమి అంతరాన్ని కాస్త తగ్గించారు.

ఇదీ చూడండి:చివరి బాలా.. మజాకా.. ఈ ఐపీఎల్​లో మస్త్ మజా ఇచ్చిన ఐదు మ్యాచ్​లివే!

Last Updated : May 11, 2023, 6:25 AM IST

ABOUT THE AUTHOR

...view details