Robin Uthappa IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022 మెగా వేలం ఇటీవలే జరిగింది. ఈసారి 10 జట్లతో సరికొత్తగా టోర్నీ నిర్వహిస్తోంది బీసీసీఐ. మెగా వేలంతో జట్లలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు కొందరిని వదులుకుని కొత్త వారికి అవకాశం కల్పించాయి. మరికొన్ని వేలంలో పాతవారినే మళ్లీ కొనుగోలు చేశాయి. 2021 ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సైతం డ్వేన్ బ్రావో, రాబిన్ ఊతప్ప, దీపక్ చాహర్, అంబటి రాయుడును తిరిగి మళ్లీ తమ జట్టులో చేర్చుకుంది. బేస్ ప్రైస్ రూ.2 కోట్లు పెట్టి ఊతప్పను తిరిగి దక్కించుకుంది. అయితే.. మెగా వేలంలో తనను ఎంపిక చేసిన విషయంపై అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాటలను తాజాగా గుర్తు చేసుకున్నాడు ఊతప్ప. ఆర్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేలం తర్వాత రెండు రోజులకు ధోనీ నుంచి కాల్ వచ్చినట్లు వెల్లడించాడు.
" రెండు రోజుల తర్వాత మహీ కాల్ చేశాడు. జట్టులోకి స్వాగతం పలికాడు. నాపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపాను. అందుకు సమాధానంగా.. ఈ నిర్ణయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు ఎంఎస్. రెండు కారణాల వల్ల కలుగజేసుకోలేదన్నాడు. ఒకటి.. మీ మంచి కోసం, సొంత గుర్తింపు కోసం జట్టులోకి రావాలని చెప్పాడు. రెండోది.. ఈ నిర్ణయంలో కలుగజేసుకుంటే నువ్వు నా స్నేహితుడివి కాబట్టే ఎంపిక చేశామని ప్రజలు ఆలోచిస్తారని అన్నాడు."
- రాబిన్ ఊతప్ప, సీఎస్కే బ్యాటర్