కఠిన పరిస్థితుల్లో రాణించే అనుభవం వచ్చిందని రాజస్థాన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ అంటున్నాడు. మొదట్లో గెలుపుపై ఆశల్లేవని.. మోరిస్, మిల్లర్ రాణించడం వల్ల నమ్మకం కలిగిందని ఆ జట్టు సారథి సంజు శాంసన్ అన్నాడు. దిల్లీ తమ కన్నా బాగా బౌలింగ్ చేసిందని క్రిస్ మోరిస్ అభిప్రాయపడ్డాడు. డెత్ ఓవర్లు కట్టుదిట్టంగా వేసుంటే గెలిచేవాళ్లమని దిల్లీ క్యాపిటల్స్ సారథి రిషభ్ పంత్ ధీమా వ్యక్తం చేశాడు. పంత్ సేన నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని సంజు బృందం మరో 2 బంతులుండగా 3 వికెట్ల తేడాతో ఛేదించిన సంగతి తెలిసిందే.
ఆ అనుభవం సొంతమైంది..
"కఠిన పరిస్థితుల్లో బౌలింగ్ చేయగల అనుభవం వచ్చిందనే చెప్తాను. సొంత మైదానంలో ఆడుతున్న అనుభూతి కలిగింది. కొత్త బంతితో స్వేచ్ఛగా బౌలింగ్ చేశాను. గత సీజన్లో అంతగా రాణించలేదు. తొలి మ్యాచ్లో అవకాశం రాకపోవడం వల్ల దీనిని సమర్థంగా ఉపయోగించుకోవాలని భావించాను. గణాంకాలను పరిశీలిస్తే వేగం తగ్గించి బౌలింగ్ చేశానని తెలుస్తుంది. మంచి లెంగ్త్‌ల్లో బంతులు వేయడమే కీలకం. కొద్దిగా తేమగా అనిపించడం వల్ల దానిని ఉపయోగించుకున్నా. పెళ్లయ్యాక ఎవ్వరైనా మారతారు! స్థిరత్వం, ప్రశాంతత వచ్చినట్టు అనిపిస్తోంది" అని జయదేవ్ ఉనద్కత్(4-0-15-3) పేర్కొన్నాడు.
మనసులో ప్రార్థించా..
"మిల్లర్, మోరిస్ ఆడటం వల్ల నమ్మకం కలిగింది. మొదట్లో కఠినంగా అనిపించింది. కానీ కుర్రాళ్లు గీత దాటించేశారు. పరిస్థితులను అధ్యయనం చేయడం ఎంతో కీలకం. మంచి లెంగ్త్‌ల్లో, వైవిధ్యంతో కట్టుదిట్టంగా బంతులు వేయడం అవసరం. ముగ్గురు ఎడమచేతి వాటం బౌలర్లు ఉండటం మా బలం. వీరిని మేం భిన్నంగా ఉపయోగించుకుంటున్నాం. సకారియాతో మాట్లాడాం. అతడెంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల మనసులో దేవుడిని ప్రార్థించాను. నేనెప్పుడూ మ్యాచ్ అయ్యాక సమీక్షించుకుంటాను. నా తొలి మ్యాచ్‌ను వందసార్లు ఆడినా సింగిల్‌కు కచ్చితంగా నిరాకరిస్తాను" అని సంజు శాంసన్ తెలిపాడు.