పోటీ ఇస్తుందనుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు బెంగళూరు బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ విన్యాసాల ముందు చిన్నబోయింది. కష్టపడి సాధించిన 177 పరుగులు కోహ్లీసేనకు ఏ మాత్రమూ సరిపోలేదు. దేవ్‌దత్, కోహ్లీ కదంతొక్కడం వల్ల 16.3 ఓవర్లకే మ్యాచ్ ముగిసింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల అభిప్రాయాలు..
ఈ సెంచరీ ప్రత్యేకం.. దేవ్‌దత్ పడిక్కల్
"ఈ రోజు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నా. కొవిడ్ బారినుంచి బయటపడి ఆడటం నా మొదటి లక్ష్యం. తొలి మ్యాచ్‌లో ఆడలేకపోవడం వల్ల చాలా బాధపడ్డా. ఈ మ్యాచ్‌లో వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. మంచి భాగస్వామ్యం ఏర్పడితే బాగుంటుంది. పని సులభం అవుతుంది. సెంచరీ ముందు పెద్దగా ఒత్తిడికి లోనవలేదు. అంతిమ లక్ష్యం మ్యాచ్ గెలవడమే. నాకు సెంచరీతో అంత ముఖ్యం కాదు. మా మధ్య స్పష్టమైన అవగాహన ఉంది. మేం బాగా ఆడుతున్నామని మాకు తెలుసు.. ఒక్కొక్కరం ఒక్కోసారి గేర్ మార్చి ఆడుతుంటాం. అయితే స్ట్రైక్ రొటేట్ చేయడం ప్రధానం. మ్యాచ్ నెగ్గడం ఆనందంగా ఉంది".
పడిక్కల్ బ్యాటింగ్ అద్భుతం.. విరాట్ కోహ్లీ
"ఈ మ్యాచ్‌లో దేవ్‌దత్ బ్యాటింగ్ చాలా బాగుంది. గత సీజన్‌లోనూ చక్కగా బ్యాటింగ్ చేశాడు. ఇప్పడు కూడా మంచి ఫాం కనబరుస్తున్నాడు. అతడికి గొప్ప భవిష్యత్ ఉంది. మ్యాచ్‌లో 50 పరుగుల తర్వాత వేగం పెంచాలని అనుకున్నాం. అలాగే చేశాం. టీ20 అంటేనే బ్యాటింగ్ భాగస్వామ్యాలు కొనసాగించడం. ఒకరు ధాటిగా ఆడితే మరొకరు స్ట్రైక్ రొటేట్ చేయాలి. నేను చివరి వరకు క్రీజులో ఉండాలనే ఉద్దేశంతో బ్యాటింగ్ చేశా. పడిక్కల్ సెంచరీకి ఏ ఆరాటం ప్రదర్శించలేదు. మ్యాచ్ ముగించేయమని చెబుతూ ఉన్నాడు. అయితే అది అతడి సెంచరీ అయ్యాకే అని చెప్పా. అతడి ఇన్నింగ్స్ సెంచరీతో పరిపూర్ణం అయింది. మా బౌలింగ్ దాడి మెరుగుపడుతోంది. స్టార్ బౌలర్లు పెద్దగా లేకపోయినా చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారు. డెత్ ఓవర్లలో మా ఆట బాగుంది. ఈ మ్యాచ్‌లో మేము 30 పరుగులు కట్టడి చేశామని అనుకుంటున్నాను. ఇదే ఆటతీరు కొనసాగిస్తాం".