Dhoni Childhood Coach : రాంచీలోని ఖరగ్‌పుర్ రైల్వే స్టేషన్లో టిక్కెట్ కలెక్టర్‌గా జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత క్రికెటర్‌గా అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అత్యంత కఠిన సమయాల్లోనూ తన జట్టును గెలుపు బాటలో నడిపించాడు. అతడెవరో కాదు చెన్నై టీమ్ సారథి ఎంఎస్ ధోనీ. చిన్నతనంలో రాంచీ గల్లీల్లో క్రికెట్ ఆడిన అతడు ఇప్పుడు క్రికెట్ హిస్టరీలో లెజెండరీగా మారాడు . నాలుగేళ్ల క్రితమే అన్నీ ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. ఐపీఎల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాడు. 41 ఏళ్ల వయసులోనూ మైదానంలో యువ ఆటగాళ్లకు ధీటుగా ఆడి జట్టుకు ఐదో కప్‌ను అందించడంలోనూ కీలక పాత్ర పోషించాడు.
IPL 2023 Dhoni : తాజాగా ముగిసిన ఐపీఎల్లో తనదైన కెప్టెన్సీతో అద్భుత ఫలితాలు సాధించి తన సత్తా ఏంటో చాటుకున్నాడు మహీ. దీంతో అతడిపై ప్రముఖ క్రీడాకారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చిన్న నాటి కోచ్ చంచల్ భట్టాచార్య.. ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన శిష్యుడిని పొగడ్తలతో ముంచెత్తారు. ధోనిలోని ఈ మెరుపు వేగాన్ని.. తొలుత తనే గుర్తించారని అన్నారు. మహీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తాడని.. ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడని అప్పుడే తాను అనుకున్నట్లు ఆయన అన్నారు.
చిన్ననాటి కోచ్ చంచల్ భట్టాచార్యతో ధోనీ దీంతో పాటు అనేక విషయాలను పంచుకున్నారాయన. "ఇప్పటికీ అతడు రాంచీలో ఉంటే ఉదయాన్నే లేచి ప్రాక్టీస్‌కు వెళ్తాడు. ఆ సమయంలో అయితే ఎవరూ అతడిని చుట్టముట్టరని.. ఎటువంటి ఆటంకం లేకుండా ప్రాక్టీస్ చేసేందుకు ఆ సమయమే సరైనదని అతడు భావిస్తాడు. కానీ అతడు ప్రాక్టీస్‌ను మాత్రం ఎప్పటికీ వదలడు. ఇంకా ఫిట్‌గా ఉండటానికి కష్టపడుతున్నాడు. అతడిలోని ఈ అంశాలే.. ధోనికి ఇతర యంగ్ ప్లేయర్స్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. గేమ్‌లో యువ ఆటగాళ్లకు దీటుగా ఆడేందుకు అతడికి శక్తినిస్తోంది" అని భట్టాచార్య అన్నారు.
Dhoni Wicket Keeping : వర్షాన్ని సైతం లెక్కచేయని యెల్లో ఆర్మీ.. ఫైనల్లో తమ కూల్ కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ జోరును చూసేందుకు తండోపతండాలుగా వచ్చింది. కానీ ఈ గేమ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి అతడు అభిమానులను నిరాశపరిచాడు. అయినప్పటికీ తన వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించి జట్టును విజయ పథంలో నడిపించాడు. ఈ విషయంపై కూడా ధోనీ కోచ్ మాట్లాడారు.
"41 ఏళ్ళ వయసులో, బ్యాటింగ్ కంటే వికెట్ కీపింగ్ చేయడం చాలా కష్టం. ప్రతి ఓవర్‌లో 6 బంతులు ఉండగా.. 20 ఓవర్లకు ఒకటి ఖచ్చితంగా స్పాట్ ఆన్‌లో ఉండాలి. ప్రతి బంతిపై దృష్టి పెట్టడం అంత సులభమైన పని కాదు. శారీరక సామర్థ్యాన్ని విపరీతంగా ఉపయోగిస్తేనే ఇది సాధ్యపడుతుంది. ధోని ఇప్పటికీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. ఒక్కోసారి టెన్నిస్ ఆడుతుంటాడు. మైండ్ గేమ్‌లు ఆడతాడు. ఏకాగ్రత పెంచేందుకు బిలియర్డ్స్ కూడా ఆడుతుంటాడు. ఇప్పటికీ అతడితో పోటీ పడటం అసాధ్యం. తనను తాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన తీరు, దాని వెనుక ఎంతో శ్రమ. పట్టుదల ఉంది" అని కోచ్ భట్టాచార్య అన్నారు.
ధోనీ చిన్ననాటి కోచ్ చంచల్ భట్టాచార్య Dhoni IPL Retirement : ఇక ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి కుడా ఆయన మాట్లాడారు. "రిటైర్మెంట్కు సరైన సమయం అనేది లేదు. ఫిట్నెస్తో పాటు కంటి చూపు అనే రెండు కీలక ఆయుధాలు ఇప్పటికీ ధోనితోనే ఉన్నాయి. ఒక క్రికెటర్ దగ్గర అది ఉంటే.. అతడు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ధోని ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని పక్కాగా అమలు చేస్తాడు" అని అన్నారు.
Dhoni cell phone number : ఈ క్రమంలో ధోని గురించి మరో ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు భట్టాచార్య. "ఒక రోజు నేను ధోనిని అడిగాను. ఏంటి మాహీ.. నువ్వు నన్ను మర్చిపోయావా.. ఫోన్ కూడా చేయవు. నా నెంబర్ ఏమైనా డిలీట్ చేశావా అని సరదాగా అడిగాను. దానికి ధోనీ 10-12 మంది ముందు నా నెంబర్‌ను చదివి వినిపించాడు. ఇలాంటి విషయాల వల్లనే అతను అందరికంటే ప్రత్యేకమైన వాడని నిరూపించుకుంటాడు" అని తన శిష్యుడి గురించి గర్వంగా చెప్పుకొచ్చారు.