ఐపీఎల్ వేలంలో కోటీశ్వరుడైన శుభ సందర్భంలో ఆ సంతోషాన్ని పంచుకోడానికి తనకెంతో ఇష్టమైన తమ్ముడు లేడని రాజస్థాన్ రాయల్స్ యువ క్రికెటర్ చేతన్ సకారియా వాపోయాడు. గురువారం చెన్నైలో జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్.. ఈ యువ క్రికెటర్‌ను రూ.1.20 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఇలాంటి సంతోషకరమైన వేళ తన సోదరుడు రాహుల్ లేకపోవడం బాధాకరమని అతడు వాపోయాడు. గతనెలలో తాను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడడానికి వెళ్లినప్పుడు తన సోదరుడు రాహుల్ ఆత్మహత్య చేసుకున్నాడని చేతన్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇప్పుడు అతడు ఉండిఉంటే తనకంటే ఎక్కువ సంతోషించే వాడని చెప్పాడు.
చనిపోయాడని కూడా చెప్పలేదు..
"ఇప్పుడు నా సోదరుడు బతికి ఉంటే నాకంటే ఎక్కువ సంతోషించేవాడు. జనవరిలో నేను ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడడానికి వెళ్లినప్పుడు అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ఇంటికి వచ్చే వరకు ఎవరూ ఈ విషయం చెప్పలేదు. టోర్నీలో ఆడుతున్నన్ని రోజులు రాహుల్ ఎక్కడున్నాడని ఇంట్లోవాళ్లను అడిగితే.. ఏదో పనిమీద బయటకు వెళ్లాడని చెప్పేవాళ్లు. అతడు చనిపోయాడనే విషయం కూడా తెలియనివ్వలేదు. ఇంటికి వెళ్లాకే అసలు విషయం తెలిసింది. నా సోదరుడు లేని లోటు పూడ్చలేనిది" అని చేతన్ రాజస్థాన్ రాయల్స్‌కు ఎంపికయ్యాక మీడియాతో అన్నాడు.
ఆర్సీబీకి నెట్ బౌలర్‌గా చేసినప్పుడే తెలుసు..
"గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నెట్‌బౌలర్‌గా సేవలందించా. అక్కడ ఆ జట్టు కోచ్‌లు మైక్ హెసన్, సైమన్ కటిచ్ నాతో మాట్లాడారు. ఐపీఎల్‌లో ఏ జట్టుకైనా ఎంపికయ్యే అన్ని అర్హతలూ సాధించానని చెప్పారు. దాంతో ఈసారి కచ్చితంగా ఏదో ఒక జట్టుకు ఎంపిక అవుతాననే నమ్మకంతో ఉన్నాను" అని చేతన్ వివరించాడు. అయితే, తన కోసం ఈసారి వేలంలో ఆర్సీబీ కూడా ప్రయత్నించిందని కానీ రాజస్థాన్ దక్కించుకుందని పేర్కొన్నాడు. తాను ఏ జట్టుకు ఆడినా సంతోషమేనని వివరించాడు.
ఆ డబ్బుతో ఏం చేస్తావని అడుగుతున్నారు..
"మా నాన్న టెంపోవ్యాన్ డ్రైవర్. ఆయనకొచ్చే ఆదాయంతో కొన్నేళ్లవరకు కుటుంబాన్ని పోషించారు. అయితే, ఆయన కష్టపడటం నాకు నచ్చేది కాదు. కుటుంబాన్ని నేను చూసుకుంటానని ఆయనతో అన్నాను. ఇప్పుడు ఇంత మొత్తం వచ్చేసరికి.. ఆ డబ్బుతో ఏం చేస్తావని అంతా అడుగుతున్నారు. 'తొలుత ఆ డబ్బు అయితే, రానివ్వండి. తర్వాత చూద్దాం' అని బదులిస్తున్నా. కానీ, ఒక మంచి ప్రదేశంలో సొంత ఇంట్లో ఉండాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడీ డబ్బుతో రాజ్‌కోట్‌లో ఒక ఇల్లు కొనుగోలు చేస్తా" అని యువ క్రికెటర్ తన కోరికను వెల్లడించాడు.
అయితే, 2018-19 సీజన్‌లో సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనద్కత్ గాయపడటం వల్ల ఆ స్థానంలో చేతన్ రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. అక్కడ ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు సాధించాడు. ఇక ఆ సీజన్ మొత్తంలో సుమారు 30 వికెట్లు పడగొట్టి వెలుగులోకి వచ్చాడు. ఆపై బెంగాల్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర విజయంలోనూ చేతన్ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఐపీఎల్‌లో రాజస్థాన్ తరఫున ఎంపికయ్యాడు. మరోవైపు చేతన్‌ను రాజస్థాన్ కొనుగోలు చేయడంపై ఆ జట్టు పేసర్ జయదేవ్ ఉనద్కత్ సంతోషం వ్యక్తం చేశాడు. చేతన్‌తో దిగిన ఫొటోను ట్విటర్‌లో పంచుకొని నీకంటే ఎవరూ ఎక్కువ కాదని పేర్కొన్నాడు.
ఇదీ చూడండి:'ముంబయి జట్టు నాకెప్పటికీ ప్రత్యేకమే'