Ambati Rayudu retirement : ఐపీఎల్ 2023 ఫైనల్‌కు ముందు షాకింగ్ వార్త బయటకు వచ్చింది. అహ్మాదాబాద్ స్టేడియం వేదికగా జరుగుతున్న చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌కు ముందుకు చెన్నై కీలక ప్లేయర్ అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. నేడు(మే 28) చివరి మ్యాచ్ ఆడుతున్నట్లు ట్విటర్‌లో తెలిపాడు.
"2010 నుంచి ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. ఐపీఎల్‌లో సీఎస్కే, ముంబయి ఇండియన్స్.. రెండు జట్ల తరఫున 204 మ్యాచ్‌లు ఆడాను. 14 సీజన్లలో 11 ప్లే ఆఫ్స్, 8 ఫైనల్స్‌లో ఆడాను. ఇప్పటివరకు 5 ట్రోఫీల విజయంలో భాగమయ్యాను. ఈరోజు కూడా ఐపీఎల్ ఆరో ట్రోఫీ గెలుస్తానని ఆశిస్తున్నాను" అని అంబటి రాయుడు పేర్కొన్నాడు.
వాస్తవానికి.. ఈ సీజన్.. మరీ ముఖ్యంగా ఈ ఫైనల్ మ్యాచ్ సీఎస్కే కెప్టెన్ ధోనీకి చివరిది అంటూ ప్రచారం సాగుతోంది. ఈ తుది పోరు తర్వాత మహీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా లేదా అని అభిమానుల మదిలో ప్రశ్న మెదులుతోంది. కానీ దీనికి ఇప్పటికైతే సమాధానం దొరకలేదు. అయితే మహీ కన్నా ముందు అంబటి రాయుడు.. ఇదే తన చివరి మ్యాచ్ అంటూ ప్రకటించి షాక్ ఇచ్చాడు.
Ambati rayudu Ipl career : 2010లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు అంబటి రాయుడు. ఈ మెగాటోర్నీలో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు 204 మ్యాచ్‌లు ఆడి 28.29 సగటుతో 4,329 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో ఓ సెంచరీ కూడా ఉంది.