ఐపీఎల్-16 చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు ఆ జట్టు బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో. ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎందుకు ముందుకు రావడం లేదు అన్న ప్రశ్నకు సమాధానమిచ్చాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ మ్యాచుల్లో ఎంఎస్ ధోనీ ఫినిషర్ పాత్ర పోషిస్తూ బ్యాటింగ్ ఆర్డర్‌లో 7 లేదా 8వ స్థానంలో దిగుతున్నాడు. అయితే ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ సీజన్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ఆయన ముందుకు రావాలని అభిమానులు ఆశ పడుతున్నారు. ఈ క్రమంలో చివర్లో వచ్చి మెరుపులు మెరిపిస్తున్న ధోనీ.. లోయర్ ఆర్డర్‌లో కాకుండా టాప్ఆర్డర్లో వచ్చి ఎందుకు బ్యాటింగ్ చేయడం లేదన్న ఫ్యాన్స్ ప్రశ్నలకు బ్రావో ఈ విధంగా బదులిచ్చాడు.
"అతడు బ్యాటింగ్ చేయాల్సిన స్థానం ఇదే. రాయుడు, దూబే, జడేజాలాంటి వారికి మరిన్ని ఎక్కువ అవకాశాలు ఇచ్చేందుకే ధోనీ లోయర్ ఆర్డర్‌లో దిగుతున్నాడు. ఒక కెప్టెన్‌గా ధోనీ తన బాధ్యతను తీసుకుని ఈ విధంగా చేస్తున్నాడు. ఫినిషింగ్ పాత్రను నిర్వహిస్తున్నందుకు అతడు చాలా సంతోషంగా ఉన్నాడు."
-సీఎస్కే బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో
ఇక ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఐదు విజయాలను తమ ఖాతాలో వేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. తాజాగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో ఈ సీజన్‌లో ఆర్‌ఆర్‌పై సీఎస్కేకు ఇది రెండో ఓటమి. తదుపరి మ్యాచ్ ఈ నెల 30న చెన్నై వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది ధోనీ సేన.