ఐపీఎల్(IPL 2021) బయోబబుల్‌లో ఆటగాళ్లతో పాటు ఈసారి 100 మంది మెడికల్ సిబ్బంది కూడా చేరనున్నారు. సెప్టెంబరు 19 నుంచి రెండోదశ లీగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరికి కరోనా టెస్ట్‌లు చేసేందుకుగానూ దుబాయ్‌లోని ఓ మెడికల్ సర్వీస్ ప్రొవైడర్‌తో బీసీసీఐ(BCCI IPL) కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. 31 మ్యాచ్‌లు జరగనున్న ఈ దశలో దాదాపుగా 30 వేల ఆర్టీపీసీఆర్ కిట్లను అందుబాటులో ఉంచనున్నారు.
క్రికెటర్లకు అత్యవసర వైద్యం కోసం బయోబబుల్(IPL Bio Bubble) నుంచి బయటకు వెళ్లాల్సిన పని లేకుండా.. వైద్య సిబ్బందినీ బయోబబుల్‌లో భాగం చేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. వారందరికీ హోటల్ సదుపాయాన్ని అధికారులు కల్పించనున్నారు. ఇందులో భాగంగా ఆటగాళ్ల కోసం ఎయిర్ అంబులెన్స్ సదుపాయాన్ని స్టేడియాల్లో కల్పించనున్నారు.
మూడు రోజులకు ఒకసారి..
ఈ బయోబబుల్‌లో ప్రతి మూడు రోజులకు ఒకసారి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌లను(RT-PCR Test) నిర్వహించనున్నారు. గతంలో ఐదు రోజులకు ఒకసారి ఈ పరీక్షలను జరపగా.. ఇప్పుడు వాటిని మూడు రోజులకు కుదించారు.