తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఐపీఎల్‌పై త్వరలోనే కీలక నిర్ణయం ప్రకటిస్తాం' - BCCI contemplating allowing fans in stadium for IPL: Ganguly

అహ్మదాబాద్​ వేదికగా జరిగే మూడో టెస్టుకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడయ్యాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ వెల్లడించారు. ఐపీఎల్​ 14వ సీజన్​కు ప్రేక్షకులను అనుమతించే విషయంపై త్వరలోనే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని పేర్కొన్నారు.

BCCI contemplating allowing fans in stadium for IPL: Ganguly
'ఐపీఎల్‌పై త్వరలోనే కీలక నిర్ణయం ప్రకటిస్తాం'

By

Published : Feb 17, 2021, 4:40 PM IST

అహ్మదాబాద్​‌ వేదికగా జరగనున్న భారత్‌-ఇంగ్లాండ్ డే/నైట్‌ టెస్టు సిరీస్‌కు టికెట్లన్నీ అమ్ముడయ్యాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​‌ గంగూలీ తెలిపారు. అతి త్వరలోనే ఐపీఎల్‌కు కూడా ప్రేక్షకుల అనుమతిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. స్వదేశంలో జరిగే ప్రతీ టెస్టు సిరీస్‌లో ఓ డే/నైట్‌ మ్యాచ్‌ను తప్పక నిర్వహిస్తామని పేర్కొన్నారు.

"అహ్మదాబాద్‌ టెస్టు టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. మునపటి స్థితికి తిరిగి చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. జై షాతో నేను మాట్లాడాను. అతడు టెస్టు మ్యాచ్‌లపై ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు. అహ్మదాబాద్‌కు 6-7 ఏళ్ల తర్వాత తిరిగి క్రికెట్‌ వస్తుంది. వాళ్లు కొత్త స్టేడియాన్ని నిర్మించారు. గతంలోనే కోల్‌కతా వేదికగా డే/నైట్ టెస్టును విజయవంతంగా నిర్వహించి ఉదాహరణగా నిలిచాం. స్టేడియంలో ప్రతీ సీట్‌ అభిమానులతో నిండిపోవాలి" అని దాదా అన్నారు.

"ఈ ఏడాది క్రికెట్‌ ఎంతో గొప్పగా ఉంటుంది. ఐపీఎల్‌కు తిరిగి ప్రేక్షకులని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. దీనిపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. అయితే ఇది మరో విజయవంతమైన టోర్నీగా నిలుస్తుంది. ఇక ఐపీఎల్‌ వేలం విషయానికొస్తే.. ఇది మెగా వేలం కాదు. కానీ చాలా జట్లు ఆటగాళ్లను తీసుకోవాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ వేలంలో చురుకుగా పాల్గొనాలని చూస్తున్నాయి" అని వెల్లడించారు.

"స్వదేశంలో జరగనున్న ప్రతి టెస్టు సిరీస్‌లో ఓ డే/నైట్ మ్యాచ్‌ను తప్పక నిర్వహిస్తాం. ప్రతి జనరేషన్‌ మార్పును కోరుకుంటుంది. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో పింక్‌ బాల్ ప్రధాన మార్పు. టెస్టు క్రికెట్‌ను మనం కాపాడుకోవాలి" అని గంగూలీ పేర్కొన్నారు. ఇటీవల యాంజీయోప్లాస్టీ చేయించుకున్న సౌరభ్ తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. ఎంతో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నానన్నారు. అదృష్టవశాత్తు అందరూ ఊహించినంత ప్రమాదం కాదని తెలిపారు.

ఇదీ చదవండి:తుది రెండు టెస్టులకు భారత జట్టు ఇదే

ABOUT THE AUTHOR

...view details