క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఐపీఎల్ 14వ సీజన్ వేలం గురువారం చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఆటగాళ్లు అనూహ్య ధర పలకగా, మరికొందరు ఊహించిన దానికంటే మరీ తక్కువ మొత్తానికి పరిమితమయ్యారు. ఏయే ఆటగాడికి ఎంత మొత్తం పెట్టాలనే స్పష్టమైన ప్రణాళికలతో వేలంలో పాల్గొన్న ఆయా ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన వాళ్లను ఎంతైనా పెట్టి కొనుగోలు చేశాయి.
ఈ క్రమంలోనే ఐపీఎల్ వేలంలో తొలిసారి పాల్గొన్న క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ తనయుడు అర్జున్ తెందూల్కర్‌పై అభిమానులు ఆసక్తి చూపించారు. అతడిని ఎవరు తీసుకుంటారు? ఎంత మొత్తం ధర పలుకుతాడనే విషయాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే, అందరూ ఊహించినట్లే ముంబయి ఇండియన్స్ అర్జున్‌ను తన కనీస ధర రూ.20 లక్షలకే తీసుకుంది. ఇతర జట్లు అతడిపై ఆసక్తి చూపకపోవడం గమనార్హం. దీంతో తొలిసారి వేలంలో పాల్గొన్న అర్జున్ తెందూల్కర్ సొంతగూటికే చేరాడని అభిమానులు భావిస్తున్నారు.
ఇక గురువారం సాయంత్రం వేలం ముగిశాక అర్జున్ మాట్లాడిన ఓ వీడియోను ముంబయి టీమ్ తమ ట్విట్టర్‌లో పంచుకుంది.
"చిన్నప్పటి నుంచీ నాకు ముంబయి జట్టంటే ఎంతో ఇష్టం. ఈ సందర్భంగా నాపై నమ్మకం ఉంచిన కోచ్‌లకు, జట్టు యాజమాన్యానికి, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ జట్టుతో కలిసి ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా."