ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య నేడు ఆసక్తికర పోరు జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు నాలుగేసి మ్యాచ్‌లు ఆడాయి. మూడు విజయాలు, ఓ పరాజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన పంత్ సేన.. మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. మూడు పరాజయాలు, ఒకే ఒక గెలుపుతో పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది సన్‌రైజర్స్.
హైదరాబాద్ కొనసాగించేనా?
మొదటి మూడు మ్యాచ్‌ల్లో గెలుపు అంచుల వరకు వచ్చి ఓటమి పాలైన వార్నర్ సేన.. ఎట్టకేలకు నాలుగో మ్యాచ్‌లో విజయాన్ని నమోదు చేసింది. చివరగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో నెగ్గి ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో స్థిరంగా రాణిస్తున్నప్పటికీ.. వీరివురి అనంతరం బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడను తలపిస్తుంది. దీంతో గత మ్యాచ్ ద్వారా ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన కేన్ విలియమ్సన్ జట్టులోకి రావడం హైదరాబాద్‌కు అతిపెద్ద సానుకూలాంశం. వీరితో పాటు మనీష్ పాండే, సమద్ రాణిస్తే సన్‌రైజర్స్‌కు తిరుగుండదు.
ఇక బౌలింగ్ విషయానికొస్తే ఐపీఎల్లో అత్యుత్తమ బౌలింగ్ లైనప్ ఉన్న జట్లలో ఎస్ఆర్హెచ్ ముందు వరుసలో ఉంటుంది. భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, నబీ, హోల్డర్ వంటి గొప్ప బౌలర్లున్నప్పటికీ వారు స్థిరంగా రాణించకపోవడమే.. వార్నర్ సేనకు ఉన్న అసలైన సమస్య. భువనేశ్వర్ ఇంతవరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. మోకాలి గాయం కారణంగా నటరాజన్ లీగ్‌కు దూరం కావడం సన్‌రైజర్స్‌కు పెద్ద లోటే. సమష్టిగా రాణిస్తే దిల్లీని ఓడించడం హైదరాబాద్‌కు అంత కష్టమేమీ కాదు.