తెలంగాణ

telangana

ETV Bharat / sports

'యూఏఈ కంటే చౌకగా ఐపీఎల్‌ నిర్వహిస్తాం' - ipl 2022 latest news

IPL Venue Southafrica: యూఏఈ కంటే చౌకగా తమ దేశంలో ఐపీఎల్‌ నిర్వహించుకోవచ్చని క్రికెట్ సౌతాఫ్రికా ప్రతిపాదించినట్లు తెలిసింది. మైదానాల వద్దకు వెళ్లేందుకు తక్కువ ప్రయాణ ఛార్జీలు, యూఏఈతో పోలిస్తే హోటల్ టారిఫ్‌లు అందుబాటులో ఉండేలా చూస్తామని సీఎస్‌ఏ హామీనిచ్చినట్లు సమాచారం.

ipl venue southafrica
ipl venue southafrica

By

Published : Jan 25, 2022, 8:16 PM IST

IPL Venue Southafrica: భారత్‌లోనే ఐపీఎల్‌ 2022 మ్యాచ్‌లను నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే తెలిపింది. ముంబయిలోని రెండు స్టేడియాల్లో అవసరమైతే పుణె మైదానంలో మ్యాచ్‌లు జరుగుతాయని పేర్కొంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిస్థితులను అంచనా వేస్తున్నట్లు కూడా వెల్లడించింది. ఈ క్రమంలో క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) కొత్త ప్రతిపాదనలను తీసుకొచ్చినట్లు సమాచారం. గత సంవత్సరం యూఏఈ వేదికగా ఐపీఎల్ జరిగింది. యూఏఈ కంటే చౌకగా తమ దేశంలో ఐపీఎల్‌ నిర్వహించుకోవచ్చని ప్రతిపాదించినట్లు క్రిక్‌బజ్‌ పేర్కొంది. బీసీసీఐ, సీఎస్‌ఏ మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపింది.

మైదానాల వద్దకు వెళ్లేందుకు తక్కువ ప్రయాణ ఛార్జీలు, యూఏఈతో పోలిస్తే హోటల్ టారిఫ్‌లు అందుబాటులో ఉండేలా చూస్తామని సీఎస్‌ఏ హామీనిచ్చినట్లు సమాచారం. దీని వల్ల ఫ్రాంచైజీల ఖర్చులు భారీగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది. సీఎస్‌ఏ బ్లూప్రింట్ ప్రకారం.. దక్షిణాఫ్రికాలోని నాలుగు స్టేడియాల్లోనే మొత్తం మ్యాచ్‌లను నిర్వహించుకునేందుకు అవకాశం ఉంది. జోహెన్నెస్‌బర్గ్‌, ప్రిటోరియా, బెనోని, పోట్చెఫ్‌స్ట్రోమ్‌ ప్రాంతాల్లో మ్యాచ్‌లను ఆడించవచ్చు. అన్ని మైదానాలు అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని, ప్రయాణ దూరం కూడా ఎక్కువగా ఉండదు. అయితే బీసీసీఐ, సీఎస్‌ఏ నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. దక్షిణాఫ్రికా వేదికగానే 2009 ఐపీఎల్‌ సీజన్‌ మ్యాచ్‌లు జరిగిన విషయం తెలిసిందే.

ఐపీఎల్‌ 2022 మ్యాచ్‌ల వేదికలను ఫిబ్రవరి 20న బీసీసీఐ ఖరారు చేయనుంది. భారత్‌లోనే మ్యాచ్‌లను నిర్వహించాలని ఫ్రాంచైజీ యాజమాన్యాలు బీసీసీఐని కోరుతున్నాయి. అయితే బీసీసీఐ సభ్యుల్లో కొందరు ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈసారి ఐపీఎల్‌లో 10 జట్లు పాల్గొననున్నాయి. మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో ఆటగాళ్ల మెగా వేలం జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details