IPL Players Afghanistan Board : అఫ్గానిస్థాన్ ప్లేయర్స్ నవీన్ ఉల్ హక్, ముజీబ్ ఉర్ రెహమాన్, ఫజల్హక్ ఫారూఖీలపై విధించిన నిషేదాన్ని ఎత్తివేస్తున్నట్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇకపై ఆ ముగ్గురు ప్లేయర్లు ఐపీఎల్‌తో పాటు ప్రపంచంలోని వివిధ ప్రధాన లీగ్‌లలో పాల్గొనవచ్చనంటూ తెలిపింది. సవరించిన పరిమితుల మేరకు ఈ ఆటగాళ్లను సెంట్రల్ కాంట్రాక్ట్‌లను అంగీకరించడానికి, ఫ్రాంచైజీ లీగ్‌లలో పాల్గొనడానికి అనుమతినిచ్చినట్లు అందులో వెల్లడించాయి. అలా ఎన్ఓసీ(No Objection Certificate) ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే దేశానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, అఫ్గన్ క్రికెట్ అవసరాలకు కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది.
అసలేం జరిగిందంటే ?
అఫ్గనిస్థాన్ జట్టులో కీలకమైన ముజీబ్, నవీన్, ఫారుఖీలు ఇటీవలే తమకు సెంట్రల్ కాంట్రాక్ట్ వద్దంటూ బోర్డుకు నివేదించారు. దీంతో, ఈ ముగ్గురికి దేశం కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని భావించిన బోర్డు ఐపీఎల్‌తో పాటు ఇతర ఫ్రాంచైజీ లీగ్స్‌లో ఆడకుండా ఉండేలా రెండేండ్ల పాటు నిషేధం విధించింది. దీంతో పాటు గతంలో ఈ ముగ్గురికి ఇచ్చిన ఎన్ఓసీని కూడా ఏసీబీకి చెందిన ఓ ప్రత్యేక కమిటీ రద్దు చేసింది. అయితే ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు ఈ ముగ్గురు చాలా కీలకం. దీంతో వారి వివరణలను విన్న బోర్డు ఈ ముగ్గురిపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది.