ఐపీఎల్ మినీ వేలం ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేలం కొంతమంది యంగ్ ప్లేయర్స్ రాతను మార్చింది. ఒక్క రాత్రిలో కోటీశ్వరులు అయ్యారు. అయితే పలువురు సీనియర్ ఆటగాళ్లకు మాత్రం నిరాశను మిగిల్చింది. ఒక్క ఫ్రాంఛైజీ కూడా వారిపై ఆసక్తి చూపలేదు. ఈ జాబితాలో భారత పేసర్ సందీప్ శర్మ కూడా ఉన్నాడు. కొచ్చిలో జరిగిన వేలంలో రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో ఉన్న తనను ఏ జట్టూ కొనుగోలు చేయకపోవడంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.
"నేను షాక్‌కు గురయ్యాను. తీవ్ర నిరాశ చెందాను. నన్నెందుకు కొనలేదో నాకే తెలియదు. ఏ జట్టుకు ఆడినా మంచి ప్రదర్శనే ఇచ్చాను. నన్ను ఏదో ఒక జట్టు కొనుగోలు చేస్తుందని అనుకున్నాను. ఇలా జరగడం ఊహించలేదు. ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు. దేశవాళీ క్రికెట్‌లో రాణించాను. రంజీ ట్రోఫీ చివరి రౌండ్‌లో ఏడు వికెట్లు తీశాను. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ రాణించా' అని సందీప్ ఆవేదన వ్యక్తం చేశాడు.