IPL Mini Auction 2023 : ఐపీఎల్ మినీ వేలానికి ఇంకా గంటల సమయమే ఉంది. దీంతో ఈ ఈవెంట్‌పైనే అందరి ఆసక్తి నెలకొంది. కొచ్చి వేదికగా జరిగే ఈ మినీ వేలంలో 10 ఫ్రాంచైజీల మధ్య హోరాహోరీ బిడ్డింగ్ జరిగే సూచనలున్నాయి. కాగా, ఈ వేలంలో 87 ఖాళీలకు గాను మొత్తం 405 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 30 మంది విదేశీ ప్లేయర్లు ఉండనున్నారు. ఎవరు రికార్డులు తిరగ రాస్తారో? ఎవరు అన్‌సోల్డ్‌గా మిగిలి పోతారో? అనే ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. అయితే ఈ ప్లేయర్స్ మాత్రం ఈసారి భారీ డీల్ సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. వారెవరంటే..
క్రిస్ మోరిస్..
ఇప్పటి వరకు జరిగిన మినీ ఐపీఎల్ వేలాల్లో.. దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్ ఎక్కువ ధర పలికిన ప్లేయర్‌గా నిలిచాడు. 2021లో రూ. 16.25 కోట్లకు మోరిస్‌ను రాజస్థాన్ జట్టు దక్కించుకుంది. దీంతో అత్యధిక ధరకు అమ్ముడైన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. కాగా, జనవరి 2022లో మోరిస్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఈసారి కూడా ఇతడిపై భారీ అంచనాలే ఉన్నాయి.
సామ్ కరన్...
ఈసారి ఆల్‌రౌండర్ సామ్ కరన్.. క్రిస్ మోరిస్ రికార్డును బద్దలుకొట్టే అవకాశాలున్నాయి. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన ఈ ఆటగాడు.. ఈ మినీ వేలంలో మంచి డీల్‌ను సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. వెన్నెముక గాయం కారణంగా 2022 సీజన్లో ఆడలేక పోయిన కరన్ బేస్ ప్రైస్ రూ. 2 కోట్లుగా ఉంది.
బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్...
ఇంగ్లాండ్ ప్లేయర్లు బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్ కోసం కూడా బిడ్డింగ్ గట్టిగానే జరగనుంది. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకుంటాడని బెన్ స్టోక్స్‌కు పేరుంది. ఇక మంచి ప్రదర్శనతో టీ20 ఫార్మాట్లో తన సత్తా నిరూపించుకున్నాడు హ్యారీ. కాగా, బెన్ స్టోక్స్ బేస్ ప్రైస్ రూ. 2 కోట్లు, హ్యారీ బేస్ ప్రైస్ రూ. 1.5 కోట్లుగా ఉంది.
కామెరూన్ గ్రీన్..
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ కోసం కూడా గట్టి పోటీ నెలకొనే అవకాశాలున్నాయి. టీ20 వరల్డ్ కప్‌లో మొదట టీమ్‌లో లేకపోయినా.. గాయం కారణంగా దూరమైన జాష్ ఇంగ్లిష్ స్థానంలో జట్టులోకి వచ్చి మంచి ప్రదర్శన చేశాడు.
కేన్ విలియమ్సన్..
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ఈ ఐపీఎల్ మినీ వేలంలో మంచి డీల్ సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. అయితే అతడి స్ట్రైక్‌రేట్ అశించిన స్థాయిలో లేదు. కానీ ఓ కెప్టెన్‌గా మాత్రం అతడికి మంచి అవభవం ఉంది. తమ జట్టుకు మంచి కెప్టెన్ కోసం చూసే ఫ్రాంచైజీలకు ఇతడొక అద్భతమైన ఆప్షన్ అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఇతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం విలియమ్సన్ తన బేస్ ప్రైస్‌ను రూ. 2 కోట్లుగా సెట్ చేసుకున్నాడు.
నికొలస్ పూరన్..
ఇటీవలే వెస్ట్ఇండీస్ కెప్టెన్‌గా వైదొలిగిన నికొలస్ పూరన్.. ఫామ్‌లేమితో బాధపడుతున్నాడు. అయినా ఈ మినీ వేలంలో అతడు మంచి ధరకు అమ్ముడయ్యే అవకాశాలున్నాయి. ఇతడితో పాటు ఇంగ్లాడ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్, జింబాబ్వే ఆల్‌రౌండర్ సిగందర్ రజా కూడా మంచి బిడ్లను సొంతం చేసుకునే అవకాశాలున్నాయి.
ఇండియన్ ప్లేయర్స్..
ఇక ఇండియన్ ప్లేయర్స్‌లో బ్యాటర్ మయాంక్ అగర్వాల్ కోసం హోరాహోరీ బిడ్డింగ్ జరిగే అవకాశముంది. ప్రస్తుతం మయాంక్ తన బేస్ ప్రైస్‌ను రూ. కోటిగా సెట్ చేసుకున్నాడు. అయితే టీమ్ఇండియాలో స్థానం కోసం ఎంతగానే తాపత్రయ పడుతున్న మయాంక్‌కు.. ఈ ఐపీఎల్ పదర్శన కీలకం కానుంది.
ఇండియన్ పేస్ బౌలర్ల కోసం చూసే జట్లకు.. టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఇషాంత్ శర్మ, జయదేవ్ ఉనద్కత్ మంచి ఆప్షన్లుగా ఉన్నారు. ఇక భారత అన్క్యాప్డ్ ప్లేయర్ల విషయానికొస్తే.. శివం మావి, యశ్ ఠాకూర్ లాంటి పేసర్లకు మంచి డీల్ లంభించే అవకాశముంది. వీరితో పాటు తమిళనాడు బ్యాటర్ ఎన్ జగదీశన్‌కు కూడా మంచి డిమాండ్ ఉంది. దీంతో ఐపీఎల్ మినీ వేలంలో ఇతడికి భారీ ఆఫర్ వచ్చే అవకాశముంది.