IPL Mega auction 2022 Ramesh kumar: కోట్లు కోట్లు కుమ్మరించిన ఐపీఎల్ వేలంలో ఒక ఆటగాడికి రూ.20 లక్షలు పలకడం పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు! కానీ ఆ మొత్తమే అతడికి పెద్ద నిధి! కెరీర్‌కు పునాది వేసే గొప్ప బహుమానం! ఎంతోమంది స్టార్ ఆటగాళ్లను కూడా నిరాశపరిచిన ఈసారి మెగా వేలం.. టెన్నిస్ బంతితో ఆడడమే తెలిసిన ఓ కుర్రాడిని తట్టి లేపింది. అనామకుడిగా ఉన్న అతడిని క్రికెట్ ప్రపంచానికి తెలిసేలా చేసింది. అతడే రమేశ్ కుమార్. వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కనీస ధర రూ.20 లక్షలకు సొంతమైన ఈ ఆల్‌రౌండర్ నేపథ్యం స్ఫూర్తిదాయకం.
పంజాబ్‌లోని జలాలాబాద్‌కు చెందిన 23 ఏళ్ల రమేశ్‌కుమార్ పేద కుటుంబం నుంచి వచ్చాడు. తండ్రి చెప్పులు కుడితే.. తల్లి గాజులు అమ్మేది. చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై ఆసక్తిని పెంచుకున్న రమేశ్.. టెన్నిస్ బంతి టోర్నమెంట్లలో ఆడేవాడు. బాగా ఆడితే వచ్చే రూ.500, రూ.1000 కోసం ఊరూరా తిరిగేవాడు. ఎడమచేతి వాటం బ్యాటింగ్, నరైన్ మాదిరే స్పిన్ బౌలింగ్‌తో అదరగొట్టే రమేశ్‌కు ‘జలాలాబాద్ నరైన్’ అనే పేరుంది. చాలా మ్యాచ్‌ల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్లను గెలిపించేవాడు. ఓ స్థానిక టోర్నీలో 10 బంతుల్లోనే 50 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడతను. ఏడేళ్ల పాటు రబ్బరు బంతి, టెన్నిస్ బంతితోనే అతడు మ్యాచ్‌లు ఆడాడు. పంజాబ్ క్రికెట్ సంఘానికి చెందిన జిల్లా మ్యాచ్‌ల్లో సత్తా చాటడం ద్వారా రంజీ ట్రోఫీ శిబిరానికి రమేశ్‌కు పిలుపొచ్చింది. అప్పుడే టెన్నిస్ బంతితో కాకుండా తోలు బంతితో తొలిసారి ఆడాడు. ఆరంభంలో బంతిని స్పిన్ చేయడం కష్టమైనా నెమ్మదిగా పట్టు సంపాదించాడు.