IPL Mega Auction 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) విజయాల్లో కీలకంగా వ్యవహరించిన దక్షిణాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్‌ను త్వరలో నిర్వహించనున్న మెగా వేలంలో సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లు ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపాడు. గత ఐపీఎల్ సీజన్‌లో డుప్లెసిస్ ఆడిన 16 మ్యాచుల్లో 633 పరుగులు చేశాడు. ఇప్పటికే, చెన్నై యాజమాన్యం ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (రూ.16 కోట్లు), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (రూ.12 కోట్లు), మొయిన్ అలీ (రూ.8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ.6 కోట్లు) రిటెయిన్ చేసుకుంది.
IPL Mega Auction 2022: అతడిని వేలంలో తీసుకుంటాం: సీఎస్కే - కాశీ విశ్వనాథన్ ఐపీఎల్ మెగావేలం 2022
IPL Mega Auction 2022: వచ్చే ఐపీఎల్ కోసం జరిగిన రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ధోనీ, జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్‌లను తీసుకుంది. కానీ గత సీజన్‌లో జట్టు గెలుపులో కీలకంగా వ్యవహరించిన డుప్లెసిస్‌ను కాదనుకుంది. తాజాగా ఈ విషయంపై స్పందించిన ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్.. అతడిని వేలంలో దక్కించుకునేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించాడు.

"గత సీజన్‌లో చెన్నై ఫైనల్‌కు చేరుకోవడంలో డుప్లెసిస్ కీలకంగా వ్యవహరించాడు. జట్టు కోసం అతడు చాలా కష్టపడ్డాడు. వచ్చే సీజన్‌కు కూడా అతడిని వేలం ద్వారా దక్కించుకోవాలనుకుంటున్నాం. చెన్నైలోని చెపాక్ స్టేడియం మాకు బాగా అచ్చొచ్చింది. సొంత మైదానంలో సీఎస్కే అభిమానుల కోలాహలం మధ్య మ్యాచుల నిర్వహించాలనుకుంటున్నాం. వచ్చే సీజన్‌లో స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోతుందనుకుంటున్నాను. చెన్నై జట్టుకు ధోనీ పెద్ద దిక్కు. కెప్టెన్‌గా జట్టు కోసం చేయాల్సిందంతా చేశాడు. క్రికెట్లో అతడికున్న అపార అనుభవం మాకు కలిసొస్తుంది. అతడి నాయకత్వంపై సందేహం అక్కర్లేదు. ఎంతటి కఠిన పరిస్థితుల్లోనైనా జట్టును గొప్పగా ముందుకు నడిపించగలడు. వచ్చే సీజన్‌లో కూడా మెరుగ్గా రాణించాలనుకుంటున్నాం" అని కాశీ విశ్వనాథన్ పేర్కొన్నాడు.