తెలంగాణ

telangana

ETV Bharat / sports

రిలయన్స్‌ మరో బిగ్‌ప్లాన్‌.. ఇకపై ఫ్రీగా IPL ప్రసారాలు! - 2023 ఐపీఎల్​ ప్రత్యక్ష ప్రసారాలు

రిలయన్స్‌ మరో సంచలనానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జియో సినిమా యాప్‌ ద్వారా ఐపీఎల్‌ ప్రసారాలను ఉచితంగానే అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

ipl live streaming free in jio tv
ఫ్రీగా ఐపీఎల్‌ ప్రసారాలు

By

Published : Jan 11, 2023, 6:06 PM IST

ఐపీఎల్‌ వచ్చిందంటే ఆ సందడే వేరు. క్రికెట్‌ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోతారు. టీవీలు చూడ్డానికి వీలుపడని వారంతా మొబైల్‌ ఫోన్లను ఆశ్రయిస్తారు. అయితే, ఇప్పటి వరకు ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్‌ కింద కొంతమొత్తం చెల్లించాల్సి వచ్చేది. దీంతో సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నవారికే ప్రసారాలు చూసే భాగ్యం దక్కేది. అయితే, ఈసారి ఉచితంగా ఐపీఎల్‌ ప్రసారాలను అందించేందుకు సన్నద్ధమవుతోంది రిలయన్స్‌. 2023 ఐపీఎల్‌ సీజన్‌కు సంబంధించి డిజిటల్‌ ప్రసార హక్కులను దక్కించుకున్న రిలయన్స్‌.. మ్యాచ్‌ ప్రసారాలను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు 'ది హిందూ బిజినెస్‌ లైన్‌' తన కథనంలో పేర్కొంది. అదే జరిగితే రిలయన్స్‌ నుంచి మరో సంచలనమే కానుంది.

2023 నుంచి 2027 వరకు ఐపీఎల్‌ ప్రసారాలకు సంబంధించి డిజిటల్‌ మీడియా హక్కులను రిలయన్స్‌ వెంచర్స్‌లో ఒకటైన వయాకామ్‌ 18 రూ.23,758 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవలే ఫిఫా వరల్డ్‌ కప్‌ను జియో సినిమా యాప్‌లో ఉచితంగా ప్రసారం చేసిన రిలయన్స్‌.. అదే స్ట్రాటజీని ఐపీఎల్‌ మ్యాచ్‌ల విషయంలోనూ అనుసరించాలని చూస్తోందని తెలిసింది. తన మార్కెట్‌ వాటాను పెంచుకోవడంలో భాగంగా ఉచితంగా లేదా చాలా తక్కువ ధరకే ప్రసారాలను అందించాలని భావిస్తోందని సమాచారం. అయితే, నాణ్యమైన ప్రసారాల కోసం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

ఐపీఎల్‌ ప్రసారాలను స్థానిక భాషల్లోనూ అందించాలని జియో భావిస్తోంది. దీనివల్ల టీవీల్లో వీక్షించే వారు సైతం డిజిటల్‌కు మారేందుకు ఈ ప్రణాళిక ఉపయోగపడుతుందని కంపెనీ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల క్రికెట్‌ అభిమానులు ఉచితంగానే ప్రసారాలను వీక్షించే అవకాశం కలగనుండగా.. అదే సమయంలో టీవీ ప్రసారాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

జియో టెలికాం సబ్‌స్క్రిప్షన్‌ కలిగిన వారికి ఉచితంగా అందించాలని కంపెనీ యోచనగా తెలుస్తోంది. మరి ఇతర టెలికాం వినియోగదారులు వినియోగించుకోవడానికి జియో సినిమాకు సబ్‌స్క్రిప్షన్‌కు పెడతారా? లేదంటే ఏదైనా బండిల్‌ ప్లాన్‌ తీసుకొస్తారా? అనేది తెలియాల్సి ఉంది. మార్చిలో ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం కాబోతోంది.

ABOUT THE AUTHOR

...view details