IPL 2022 venue: దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తోంది. ఈసారి ఐపీఎల్‌ను పూర్తిగా మహారాష్ట్ర, గుజరాత్లో నిర్వహించడంపై సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని క్రికెట్ వర్గాలకు చెందిన ఓ ప్రతినిధి చెప్పారు. "లీగ్ దశను మహారాష్ట్రలో, ప్లేఆఫ్స్‌ను అహ్మదాబాద్‌లో(గుజరాత్) నిర్వహించాలని బోర్డు చర్చలు జరుపుతోంది" అని ఆయన పేర్కొన్నారు.
లీగ్స్టేజ్ను ముంబయిలోని వాంఖడే మైదానం, క్రికెట్ క్లబ్ ఆప్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో ఉన్న బ్రాబోర్న్ స్టేడియం, నేవీ ముంబయిలో డీవై పాటిల్ స్టేడియం, పుణె దగ్గర్లో ఉన్న మహారాష్ట్ర క్రికెట్ అసోసియేన్ మైదానంలో.. ప్లేఆఫ్స్‌ను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
"ఐపీఎల్.. సీసీఐలో నిర్వహిస్తారని ఆశిస్తున్నాను, మేము ఆతిథ్యం ఇవ్వడాన్ని సంతోషంగా భావిస్తాం" అని సీసీఐ అధ్యక్షుడు ప్రేమల్ ఉదాని చెప్పారు.