RR Franchise Jos Buttler : వివిధ దేశాల్లో ఆయా లీగ్‌ల్లో ఆడుతున్న కొందరు స్టార్ ఆటగాళ్లను.. తమ జట్టుతోనే ఉంచుకునే విధంగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ ప్రణాళికలు రచిస్తున్నాయి. వారిని ఆకర్షించేందుకు ఇప్పటికే సరికొత్త డీల్స్‌ను రూపొందించిన్నట్లు సమాచారం. ఈ జాబితాలో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు జాస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్‌తో పాటు మిగతా కీలక ప్లేయర్స్ ఉన్నారు.
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడే బట్లర్‌కు ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం మిగతా లీగుల్లో కూడా తమ జట్టు తరఫున పాల్గొనేలా బంపర్ ఆఫర్‌ను ప్రకటించేందుకు రెడీ అయిందట. గ్లోబల్ క్రికెట్‌లో బట్లర్‌ను తమ ఫ్రాంచైజీకే పరిమితం చేసేలా ఆర్ఆర్ మేనేజ్మెంట్ కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ భారీ డీల్‌తో త్వరలోనే బట్లర్‌ను సంప్రదించనున్నట్లు సమాచారం.
నాలుగేళ్లపాటు తమతోనే..
RR Offer To Jos Buttler : 2018 నుంచి ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న జాస్ బట్లర్‌ను.. మరో నాలుగేళ్ల పాటు వివిధ లీగ్ మ్యాచుల్లోనూ తమ జట్టు తరఫున ఆడించాలని భావిస్తోందట రాజస్థాన్ ఫ్రాంచైజీ. ఇంకా చర్చల దశలోనే ఉన్న ఈ ప్రతిపాదనను త్వరలోనే బట్లర్ ముందుకు అధికారికంగా ఉంచనున్నట్లు తెలుస్తోంది. వన్డేల్లో మంచి క్రికెట్ కెరీర్ ఉన్న బట్లర్ ఈ ఆఫర్‌ను ఒప్పుకుంటాడా.. లేదా.. అనేది ఆసక్తికరంగా మారనుంది. అయితే ఒకవేల ఈ డీల్‌ను గనుక ఒప్పుకుంటే ప్రతి ఏడాది భారీ మొత్తంలోనే సంపాదించనున్నాడు. ఆర్ఆర్ తరఫున ఇప్పటివరకు 71 మ్యాచులాడిన బట్లర్.. 5 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ లీగ్‌తో పాటు దక్షిణాఫ్రికాలో ఆర్ఆర్కు సంబంధించిన 'పార్ల్ రాయల్స్' ఫ్రాంచైజీ తరఫున టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్.
రాజస్థాన్ బాటలో ముంబయి కూడా..
Mumbai Indians Jofra Archer : మరోవైపు ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ కూడా ఇంగ్లాండ్ మరో ఆటగాడు ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్‌కు సరిగ్గా ఇలాంటి ఆఫర్‌నే ఇచ్చేందుకు ప్లాన్ చేసిందట. ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్, దక్షిణాఫ్రికా తరఫున టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఆర్చర్.
జీతాలు పెంచి.. వెళ్లకుండా..
England and Wales Cricket Board : అయితే తమ ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్ధంగా లేని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అందుకు అనుగుణంగా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం తమ ఆటగాళ్లకు ఏటా ఇచ్చే జాతీయ కాంట్రాక్టుల కాలపరిమితిని మరింత పెంచాలని యోచిస్తోందట. ఆటగాళ్లకు ఏకంగా నాలుగేళ్ల పాటు జాతీయ కాంట్రాక్టు ఇవ్వడంతో పాటు వారి జీతభత్యాలను భారీగా పెంచడం వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా తమ ప్లేయర్లను పూర్తిగా ఫ్రాంచైజీల్లోకి వెళ్లకుండా చేయొచ్చని ఈసీబీ భావిస్తోందట. అయితే ఆర్చర్, బట్లర్‌ను మాత్రమే కాకుండా లియామ్ లివింగ్‌స్టోన్, శామ్ కరన్ వంటి కీలక ప్లేయర్లకు కూడా ఇటువంటి ఆఫర్లను ఎరగా చూపి కట్టిపడేసే ప్రయత్నాలు చేస్తున్నాయట కొన్ని ఫ్రాంచైజీలు.