IPL brand value 2023: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) దీనికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరల్డ్ వైడ్‌గా ఈ లీగ్‌కు ఉన్నంత క్రేజ్ ఇతర ఏ లీగ్‌కు లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు.. ఈ మెగా టోర్నీ కోసం రెండు నెలల పాటు టీవీలు, సెల్ఫోన్లకు అత్తుక్కుపోతారు. సిక్సులు, ఫోర్లతో ధనాధన్ బ్యాటింగ్, కళ్లు చెదిలే ఫీల్డింగ్ విన్యాసాలు, మెరుపు వేగంతో బౌలింగ్.. అబ్బో క్రికెట్ అభిమానులను తెగ అలరిస్తుంది ఈ లీగ్.
2008లో ప్రారంభమైన ఈ లీగ్ ప్రతీ ఏడాది.. విశేష ఆదరణ, ఆదాయాన్ని అందుకుంటూ.. విలువ పరంగా హద్దులను చెరిపేస్తూ ముందుకెళ్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ బ్రాండ్ విలువ ఏకంగా సుమారు 3.2 బిలియన్ అమెరికా డాలర్లకు చేరింది. అంటే భారత కరెన్సీలో రూ.26,432 కోట్లు. ఈ విషయాన్ని తెలుపుతూ.. అమెరికాకు చెందిన బహుళజాతి స్వతంత్ర పెట్టుబడి బ్యాంకు, ఆర్థిక సేవల సంస్థ హౌలిహన్ లోకీ ఓ నివేదికను విడుదల చేసింది.
అంతకుముందు ఈ బ్రాండ్ విలువ దాదాపు దాదాపు 1.8 బిలియన్ అమెరికా డాలర్లుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో రూ.14,868 కోట్లు. అంటే ఒక్క ఏడాదిలోనే ఐపీఎల్ విలువ వృద్ధి రేటు దాదాపుగా 80 శాతం నమోదైంది. ఈ లీగ్ వ్యాపార సంస్థ వ్యాల్యూ కూడా 80 శాతం వృద్ధి రేటు అందుకుంది. రూ.70,212 కోట్ల నుంచి రూ.1.27 లక్ష కోట్లకు చేరింది.
మీడియా రైట్స్‌లో అదే టాప్.. ఇక 2023-27 కాలానికి గాను ఐపీఎల్ మీడియా రైట్స్ విలువ రూ.48,390 కోట్లు. వయాకామ్ 18, డిస్నీ స్టార్ కలిపి ఈ భారీ మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేశాయి. అందుకే ఈ లీగ్ విలువ ఇంతలా పెరిగింది. 2017తో పోలిస్తే 2023 మీడియా రైట్స్ వార్షిక వృద్ధి రేటు 196 శాతంగా నమోదైంది. అంటే ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్‌కు బ్రాడకాస్టర్లు చెల్లించే మొత్తం.. అమెరికా జాతీయ బాస్కెట్‌బాల్ సంఘం (ఎన్‌బీఏ), ఇంగ్లిష్ ప్రిమియర్ లీగ్ (ఈపీఎల్), బుండెస్‌లిగా కన్నా ఎక్కువగా ఉండటం విశేషం. అయితే ఈ జాబితాలో అమెరికా జాతీయ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) అందరికన్నా ముందుంది. ఇదొక్కట్టే ఐపీఎల్ కన్నా ముందు స్థానంలో నిలిచింది.