IPL Auction 2024 Strac Cummins : దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఆస్ట్రేలియా ప్లేయర్లు చరిత్ర సృష్టించారు. ఇంతవరకు ఏ ఆటగాడు కూడా రూ.20 కోట్లకుపైగా కొల్లగొట్టలేదు. ఈసారి వేలంలో సన్స్‌రైజర్స్ హైదరాబాద్ కమిన్స్‌ను రూ.20.50 కోట్లకు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లకు దక్కించుకున్నాయి. ఇలా ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర దక్కడంపై ఆసీస్ ప్లేయర్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
'ఆ నమ్మకం ఉంది'
Mitchell Starc Reaction: మిచెల్ స్టార్క్ కోసం దిల్లీ, ముంబయి, గుజరాత్, కోల్‌కతా తీవ్రంగా పోటీ పడ్డాయి. కేకేఆర్ మాత్రం చివరి వరకు ఎక్కడా తగ్గకుండా ఈ యార్కర్ల కింగ్‌ను దక్కించుకుంది. ఈ విషయంపై స్టార్క్ స్పందించాడు. "నిజంగా షాక్‌కు గురయ్యాను. ఇంత మొత్తాన్ని అసలు ఊహించలేదు. ఎనిమిదేళ్ల తర్వాత ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 లీగ్‌లో మళ్లీ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు విలువ పెరిగినా నా ఆటతీరు మారలేదు. భారీ మొత్తం దక్కడం అంటే ఒత్తడి ఉండటం సహజమే అయినా నాకున్న అనుభవంతో మంచి ఫలితాలు సాధిస్తాననే నమ్మకం ఉంది" అని స్టార్క్ తెలిపాడు.
'హైదరాబాద్ అంటే నాకు ఇష్టం'
Pat Cummins Reaction : ఈ మినీ వేలంలో రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌తో వచ్చిన కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ ధరకే సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర సొంతం చేసుకున్న రెండో ఆటగాడిగా కమిన్స్ రికార్డులకెక్కాడు. ఈ విషయంపై అతడు తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. "సన్‌రైజర్స్‌తో జత కట్టేందుకు ఉత్సాహంతో ఉన్నా. ఆరెంజ్ ఆర్మీ గురించి చాలా విన్నా. హైదరాబాద్‌లో కూడా మ్యాచ్‌లు ఆడాను. నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నాతో పాటు హెడ్ కూడా ఉన్నాడు. విజయాలతో సీజన్ సాగాలని ఆశిస్తున్నా" అని కమ్మిన్స్ పేర్కొన్నాడు.