IPL Auction 2022: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్, మహమ్మద్ సిరాజ్‌ను అట్టిపెట్టుకుంది. ఒక్కో జట్టులో కనిష్ఠంగా 18 మంది నుంచి గరిష్ఠంగా 25మంది సభ్యుల వరకు ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ రూ.57 కోట్లతో మెగా వేలంలోకి వచ్చింది. అయితే అందులో సగం (రూ.28.50 కోట్లు) కేవలం ముగ్గురి కోసమే వెచ్చించడం గమనార్హం. మిగిలిన ఆటగాళ్ల కోసం మరో సగం సొమ్ము మాత్రం వెచ్చించే అవకాశం ఉంది. గత ఏడాది అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్న హర్షల్ పటేల్‌పై రూ. 10.75 కోట్లు, ఆల్‌రౌండర్ వనిందు హసరంగపై రూ. 10.75 కోట్లు ఖర్చు చేయగా.. బ్యాటర్ డు ప్లెసిస్‌ను రూ.7 కోట్లకు దక్కించుకుంది.
హర్షల్ పటేల్: గత సీజన్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచాడు. అత్యధికంగా 32 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ముంబయి ఇండియన్స్ మీద ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన ఏకైక బౌలర్ కూడా హర్షల్ పటేలే. అందుకే ఆర్‌సీబీ మరోసారి ఈ బౌలర్‌పై నమ్మకంతో భారీ ధరను వెచ్చించి మరీ సొంతం చేసుకుంది.
హసరంగ: లంకకు చెందిన ఆల్‌రౌండర్. గత సీజన్‌లోనే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అయితే కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. అంతర్జాతీయంగా టీ20 స్పెషలిస్ట్ అయిన హసరంగ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంకర్. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే హసరంగ 119 స్ట్రైక్ రేట్‌తో ఇప్పటివరకు టీ20ల్లో 33 మ్యాచుల్లో 319 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో కేవలం 31 ఇన్నింగ్స్‌ల్లో 52 వికెట్లు పడగొట్టి లంక తరఫున కీలక ఆటగాడిగా ఎదిగాడు.
డు ప్లెసిస్: గత సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్. సీఎస్‌కే కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడు. దక్షిణాఫ్రికా టాప్ ప్లేయర్.. అలాంటి డు ప్లెసిస్‌ను దక్కించుకోవడానికి ఆర్‌సీబీకి ఇంకేం కావాలి. దేవ్‌దత్ పడిక్కల్‌ను దక్కించుకోలేకపోయిన ఆర్‌సీబీ ఓపెనింగ్ లోటును తీర్చుకోవడానికి డుప్లెసిస్‌ను వేలంలో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.