Rahuls name in IPL auction: ఐపీఎల్ మెగా వేలంలో పలువురు ఆటగాళ్లు జాక్‌పాట్ కొట్టారు. ఇషాన్ కిషన్(రూ. 15.25 కోట్లు), దీపక్ చాహర్(రూ. 14 కోట్లు), శ్రేయస్ అయ్యర్(రూ.12.25 కోట్లు), శార్దుల్ ఠాకుర్, నికోలస్ పూరన్, హసరంగ, హర్షల్ పటేల్(రూ. 10.75 కోట్లు) మిలియనీర్ల క్లబ్లో చేరారు.
అయితే ఇక్కడే ఒకటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
- వేలానికి ముందు కేఎల్ రాహుల్‌ను రూ. 17 కోట్లకు దక్కించుకుంది లఖ్‌నవూ సూపర్ జెయింట్స్. కొన్ని సీజన్లుగా పంజాబ్.. రాహుల్‌ను రూ. 11 కోట్ల ధరకే అట్టిపెట్టుకొంది.
- శనివారం జరిగిన తొలిరోజు వేలంలో రాహుల్తెవాటియా అత్యంత ఆకర్షణగా నిలిచాడు. ఇతడి కోసం చెన్నై చివరి వరకు ప్రయత్నించినా.. గుజరాత్ టైటాన్స్ రూ.9 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే గతేడాది రాజస్థాన్ జట్టు తెవాటియాకు చెల్లించింది రూ. 3 కోట్లు మాత్రమే.
- గత సీజన్లో కోల్‌కతాకు ఆడిన రాహుల్ త్రిపాఠిని రూ. 8.50 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్ చేజిక్కించుకుంది. ఇతడి కోసం కేకేఆర్, చెన్నై బాగానే ప్రయత్నించాయి. అంతకుముందు సీజన్లో కోల్‌కతా ఇతడికి ఇచ్చింది రూ. 60 లక్షలే.
- కొన్నిసీజన్లుగా ముంబయికి ఆడిన రాహుల్చాహర్ కోసం దాదాపు అన్ని ఫ్రాంఛైజీలు ప్రయత్నించాయి. చివరకు రూ. 5.25 కోట్ల ధరకు పంజాబ్ సొంతమయ్యాడు. 2021లో ముంబయి ఇతడికి చెల్లించింది రూ. 1.90 కోట్లు.
పైది గమనిస్తే మీరొకటి తెలుసుకోవచ్చు. ఈ నలుగురి పేర్లలో 'రాహుల్' ఉంది. కేఎల్ రాహుల్, రాహుల్ తెవాటియా, రాహుల్ త్రిపాఠి, రాహుల్ చాహర్.. వీళ్లంతా శనివారం వేలంలో కోట్లకు కోట్లు పలికారు. అంతకుముందు ధర కంటే పెద్దమొత్తంలో సొంతం చేసుకున్నారు.
ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాహుల్ పేరు పెట్టుకుంటే ఐపీఎల్లో దశ తిరిగినట్లేనని మీమ్స్ చేస్తున్నారు.